ఆనం అడ్డాలో జగన్...!

Update: 2018-02-03 01:30 GMT

ఆనం వివేకానందరెడ్డి...ఆయన పేరు తెలియని వారు ఎవరూ ఉండరు. నెల్లూరు అంటేనే ఆనం సోదరుల పేరు గుర్తుకు వస్తుంది. ఈ బ్రదర్స్ లో వేష, భాషల్లో ప్రత్యేకత చూపించే ఆనం వివేకానందరెడ్డి స్టయిలే వేరు. దశాబ్దకాలం పాటు వివేకా చక్రం తిప్పారు. ఆయనకు మంత్రి పదవి అవసరం లేదు. తన సోదరుడికి వస్తే చాలనుకున్నారు. నెల్లూరు పట్టణాన్ని తన గుప్పిట్లో దశాబ్దకాలం ఉంచుకున్న ఆనం వివేకా 2014 రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాల్లో వస్తున్న మార్పులు గుర్తించి టీడీపీలోకి జంప్ చేశారు. అయితే నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి 2009లో ఆనం వివేకానందరెడ్డి కాంగ్రెైస్ అభ్యర్థిగా విజయం సాధించారు. ఇప్పుడు ఆయన ఇలాకాలోనే జగన్ పాదయాత్ర ప్రారంభం కాబోతోంది.

పాదయాత్రకు భారీ ఏర్పాట్లు....

నెల్లూరు జిల్లాలో జగన్ పాదయాత్ర జోరుగా సాగుతోంది. పొదలకూరులో నిన్న కోర్టుకు హాజరయ్యేందుకు పాదయాత్రకు విరామమిచ్చిన జగన్ ఈరోజు నుంచి యాత్రను కొనసాగించనున్నారు. ప్రస్తుతం సర్వేపల్లి నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగుతుంది. ఈరోజు సాయంత్రానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి చేరుకుంటుంది. ఆనం వివేకా ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం కావడంతో వైసీపీ నేతలు ఇక్కడ భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇదే నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గెలుపొందారు. ఆయన ఇప్పటికే నియోజకవర్గంలో పాదయాత్ర పూర్తి చేసుకుని వచ్చారు.

వివేకాపై విమర్శలు చేస్తారా?

ఆనం వివేకానందరెడ్డి జగన్ మీద ఫైర్ అయ్యే మొదటి వ్యక్తి. టీడీపీలో చేరిన తర్వాత జగన్ ను తూర్పారపట్టడంలో ఆనం వివేకా ముందుంటారు. వెటకారంతో...వ్యంగ్య వ్యాఖ్యానాలు చేస్తూ జగన్ ను విమర్శించడం ఆయనకు అలవాటుగా మారింది. అయితే టీడీపీలో చేరినా తమకు తగిన గుర్తింపు లభించడం లేదని ఆనం వివేకా నియోజకవర్గాన్ని దాదాపుగా వదిలేశారు. హైదరాబాద్ కే పరిమితమయ్యారు. ఈ పరిస్థితుల్లో జగన్ పాదయాత్ర జరుగుతుండటంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జగన్ కు స్వాగతం పలుకుతూ పెద్దయెత్తున స్వాగత ద్వారాలు వెలిశాయి. ఫ్లెక్సీలు కట్టి తమ అభిమాన నేతకు స్వాగతం పలుకుతున్నారు.జగన్ పై విమర్శలు చేస్తున్న వివేకాకు పాదయాత్ర ద్వారా బుద్ధి చెబుతామని వైసీపీ నేతలు అంటున్నారు.

నేటి పాదయాత్ర ఇలా....

77వ రోజు జగన్ పాదయాత్ర కేవలం 7.5 కిలోమీటర్లే చేశారు. కోర్టుకు హాజరుకావాల్సి ఉండటంతో ఆయన పాదయాత్రను త్వరగా ముగించారు. 78వ రోజు జగన్ పాదయాత్ర నెల్లూరు జిల్లా సర్వే పల్లి నియోజకవర్గం మరుపూరు శివారు నుంచి ప్రారంభం కానుంది. శనివారం ఉదయం ప్రారంభమయ్యే జగన్ పాదయాత్ర మట్లెంపాడు, మోపూరు క్రాస్ రోడ్స్, మొగళ్లపాలెం మీదుగా, సౌత్ మోపూరు వరకూ ప్రజాసంకల్ప యాత్ర సాగుతుంది. ఈరోజు సాయంత్రానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోకి జగన్ పాదయాత్ర ప్రవేశించే అవకాశముంది.

Similar News