ఆదాయంపై సర్కారీ విలాపాలు అర్థంలేనివి!

Update: 2016-12-16 11:52 GMT

నోట్ల రద్దు తర్వాత.. ఏదో ఒకటి రెండు రంగాలు, ఒకరిద్దరు వ్యక్తులు కాదు.. ఆ దెబ్బకు చాలా విపరిణామాలు సంభవించాయి. అయితే ఒక మంచి ప్రయత్నం కోసం కష్టపడుతున్నాం అనే అందరూ దానిని సహిస్తున్నారు. జనంలో నూటికి నూరుశాతం ఈ నోట్ల దెబ్బకు గురవుతూనే ఉన్నారు. అలాంటి సమయంలో ప్రభుత్వాలు తమ రంగాల్లో ఆధాయం తగ్గిందంటూ విలపించడం సబబు కాదని పలువురు భావిస్తున్నారు. నోట్ల రద్దు పర్యవసానంగా చాలా రకాల ఆర్థిక కార్యకలాపాలు మందగించాయి. ఆ ఎఫెక్టు ఆ రంగాలను సహజంగానే దారుణంగా దెబ్బతీసింది. ప్రజలు సహిస్తున్నట్టే, ప్రభుత్వ రంగాలు కూడా ఆ నష్టాల్ని స్వీకరించాలి అంతే తప్ప.. మేం ఆదాయం కోల్పోయాం అంటూ బాధపడడం అనవసరం.

తాజాగా ఏపీ ఎక్సయిజు మంత్రి కొల్లురవీంద్ర.. తమ రాష్ట్రంలో నోట్ల రద్దు తర్వాత.. ఎక్సయిజు శాఖ ఆదాయం 200 కోట్ల రూపాయల మేర తగ్గిపోయిందంటూ ఆవేదన చెందుతున్నారు. ఇది ఆయన ఒక్కడి ఆవేదన మాత్రమే కాదు. ప్రభుత్వాల్లోని చాలా శాఖల మంత్రులు , అధికారులు తమతమ శాఖల్లో లాభాలు తగ్గాయంటూ విలపిస్తున్నారు. అయితే ఇలా ప్రజలు మద్యం సేవించడం తగ్గిపోయిందని మంత్రిగారు విచారిస్తున్నట్లుగా ఉంది. అయినా పన్నుల వ్యవస్థలను సక్రమంగా స్థిరీకరించుకోలిగితే ఇతర రంగాలనుంచి వచ్చే ఆదాయం బాగా పెరుగుతుంది. ఉదాహరణకు కేంద్రం ఆశిస్తున్నట్లుగా డిజిటల్ లావాదేవీలు పెరిగి.. దుకాణాల్లో జరిగే అన్ని లావాదేవీల మీద పద్ధతిగా ప్రభుత్వానికి పన్ను వసూలయ్యే వ్యవస్థను ప్రభుత్వం అనుసరించగలిగితే.. ప్రజలు మద్యం తాగకపోవడం వల్ల కోల్పోయే లాభం కంటె ఇబ్బడి ముబ్బడిగా అధికంగా వస్తుందని కూడా అనుకోవచ్చు.

 

Similar News