ఆజాద్ అడ్డంగా దొరికిపోయారే...!

Update: 2017-12-13 02:30 GMT

ఇటీవల కాలంలో ఏసీబీ వలలకు పెద్ద పెద్ద చేపలే చిక్కుతున్నాయి. తాజాగా ఏసీబీ జరిపిన దాడిలో 50 కోట్ల రూపాయలకు పైబడి అక్రమాస్తులు వెనకేసుకున్న దేవాదాయశాఖ రాజమండ్రి ఆర్జేసీ చంద్రశేఖర్ ఆజాద్ అడ్డంగా దొరికిపోయారు. రాష్ట్రంలోని పలు దేవాలయాలకు ఈవో బాధ్యతలు నిర్వర్తించడం తో బాటు అవినీతిలో టాప్ గా కొనసాగుతున్నట్లు ఎసిబి నిఘా వర్గాలు సమాచారం సేకరించాయి. చాలా కాలంగా ఆయన పై కన్నేసిన ఎసిబి తాజాగా దాడులకు దిగింది. ఆయన స్థిర చరాస్తులు ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రస్తుతం 50 కోట్ల రూపాయలు గా తేలితే బహిరంగ మార్కెట్ లో వీటి విలువ పదిరెట్లు ఎక్కువనే చెప్పాలి.

ఏకకాలంలో 16 చోట్ల దాడి....

రాజమండ్రి, అనంతపురం, విజయవాడ, ఏలూరు ప్రాంతాల్లోని ఆజాద్ బంధువులు, మిత్రులు పై ఎసిబి ఏకకాలంలో 16 చోట్ల దాడులకు దిగడం సంచలనం సృష్ట్టించింది. రెండుకోట్ల రూపాయల విలువైన భవంతి, సోదరుడి పేరుపై 32 ఎకరాల్లో సోలార్ పవర్ ప్లాంట్ అనేక చోట్ల ప్లాట్లు, బంగారం దాడుల్లో కనుగొన్నారు అధికారులు. ఆజాద్ అత్యంత విలాసవంతమైన లైఫ్ స్టయిల్ అనుభవిస్తారని అధికారులు గుర్తించారు. యూరప్ , సింగపూర్, మలేసియా దేశాలకు వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నట్లు ఆధారాలు లభించాయి. దాడుల సమయంలో విజయవాడలో వున్న ఆజాద్ ను ఆయన ప్రస్తుతం పనిచేస్తున్న రాజమండ్రి కి తరలించారు అధికారులు. బ్యాంక్ డిపాజిట్లు లాకర్లు వంటివి ఆపరేట్ చేస్తే ఈ అవినీతి తిమింగలం తిన్న సొమ్ముల లెక్కలు మరిన్ని బయటపడనున్నాయి.

Similar News