ఆ విషయంలో దేశంలోనే చంద్రబాబు నెంబర్ వన్!

Update: 2016-11-17 13:29 GMT

మన దేశంలో 29 రాష్ట్రాలున్నాయి. ముఖ్యమంత్రులు ఉన్నారు. ఒక్కొక్క కోణంలోంచి చూస్తే ముఖ్యమంత్రులకు ర్యాంకులు రకరకాలుగా దక్కవచ్చు. ఆయా కోణాల్లో సీఎం ల మధ్య పోటీ కూడా ఉండవచ్చు. కానీ ప్రస్తుతం ఒక విషయంలో చంద్రబాబునాయుడు దేశంలో ఉన్న ముఖ్యమంత్రులు అందరీలోకీ నెంబర్ వన్ అనిపించుకుంటున్నారు. ఆ విషయంలో.. ఆయనతో పోటీపడడానికి సమీపంలో కూడా ఎవ్వరూ లేరు మరి! ఇంతకూ అదేమిటో తెలుసా.. వ్యక్తిగత భద్రత విషయంలో. దేశంలో ఎవ్వరికీ లేనంత భారీ స్థాయిలో చంద్రబాబుకు పోలీసు భద్రతను ఇవాళ పెంచారు. మల్కన్ గిరి ఎన్‌కౌంటర్, మావోయిస్టుల హెచ్చరికల నేపథ్యంలో తీసుకున్న చర్య ఇది.

చంద్రబాబునాయుడుకు మావోయిస్టులనుంచి ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉండడం అనేది ఇవాళ్టి సంగతి కాదు. గతంలో తిరుమల వెళ్తుండగా ఆయన మీద మావోల మందుపాతర దాడి జరిగిన తర్వాత.. భద్రతను మరింత పెంచారు. ఆయనకు ప్రస్తుతం ఎన్‌ఎస్‌జీ భద్రత కల్పిస్తున్నారు. అయితే తాజా హెచ్చరికల నేపథ్యంలో భద్రతను మరింతగా పెంచారు. ప్రస్తుతం మొత్తం 496 మంది పోలీసు అధికారులతో ఆయన వ్యక్తిగత భద్రతవ్యవస్థ ఏర్పాటు అయింది. మొత్తం 290 ఇంటెలిజెన్స్ పోస్టులను మంజూరు చేసారు.

హైదరాబాదు మరియు బెజవాడ లోని నివాసాల వద్దనే 144 మంది పోలీసులతో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే అయిదుగురు అడిషనల్ ఎస్పీ స్థాయి అదికారులు ఆయన భద్రతను పర్యవేక్షిస్తూ ఉంటారు. అలాగే మొబైల్ పార్టీలో.. ఆయన వెంట పర్యటనలు, కాన్వాయ్ వెళుతున్న సమయంలో వెంట ఉండే భద్రత సిబ్బంది సంఖ్యను కూడా పెంచారు. మొత్తానికి భద్రత కోసం నియుక్తులైన పోలీసు అధికారుల సంఖ్య విషయంలో 290 మందితో దేశంలోనే నెంబర్ వన్ సీఎంగా చంద్రబాబు రికార్డు సృష్టించారన్నమాట.

Similar News