ముందు వెనుక చూసుకోకుండా ఎంత మాట వస్తే అంత మాట అనేయడం అనేది.. ముందు ముందు ఎంతటి చిక్కులనైనా తెచ్చిపెట్టగలదని.. కాంగ్రెస్ పార్టీ యువరాజు రాహుల్ గాంధీకి బహుశా ఇప్పుడు స్వానుభవంలోకి వస్తూ ఉంటుంది. మహాత్మాగాంధీ హత్యకు సంబంధించి... ఆరెస్సెస్ కు ఆపాదిస్తూ వివాదస్పద వ్యాఖ్యలు చేసినందుకు ఇప్పుడు రాహుల్ గాంధీ కోర్టుకు హాజరు కావాల్సి వచ్చింది.
మహాత్మాగాంధీ హత్యను ఆరెస్సెస్ చేయించిందంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిపై పరువు నష్టం కేసు నమోదు అయింది. తన వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉంటానని వెనక్కు తగ్గేది లేదని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అయితే కోర్టు సమన్లు అందుకున్న రాహుల్.. తాను నేరుగా కోర్టు కు హాజరు కావాల్సిన అవసరం లేకుండా పర్మిషన్ ఇవ్వాలని కోరారు. దీనిని గౌహతి కోర్టు తోసి పుచ్చింది.
దీంతో అనివార్యంగా రాహుల్ గాంధీ, గౌహతి కోర్టుకు హాజరు కావాల్సి వచ్చింది. ఆరెస్సెస్ వేసిన పరువు నష్టం కేసులో ఆయన విచారణ ను ఎదుర్కొంటున్నారు. రాహుల్ వ్యాఖ్యలు ఆన్ రికార్డ్ ఉన్నవే కావడంతో.. ఈ వివాదం నుంచి ఎలా బయటకు వస్తారో చూడాలి.