ఆ రెడ్డి గారు దిగితే మంత్రికి చుక్క‌లేనా..?

Update: 2018-01-31 09:30 GMT

రానున్న ఎన్నిక‌లు ఇరు రాష్ట్రాల్లోని మంత్రులు, ఎమ్మెల్యేల‌కు స‌వాల్ విస‌ర‌బోతున్నాయి. కొంద‌రు మంత్రులు త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో వ్య‌తిరేకత ఎదురుకోవ‌డంతో పాటు ఇత‌ర పార్టీల నేతలు కూడా గ‌ట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధ‌మ‌వు తున్నారు. తెలంగాణ‌లో ఇప్పుడు ఒక మంత్రి ఇదే ప‌రిస్థితి ఎదుర్కొంటున్నారు. మంత్రి హోదాలో ఉన్నా.. నియోజ‌క వ‌ర్గంలో ప‌ట్టు సాధించ‌లేక‌పోవ‌డం, బలంగా ఉన్న సామాజిక‌వ‌ర్గాన్ని త‌న‌వైపు తిప్పుకోవ‌డంలో విఫ‌ల‌మ‌వ‌డం, నియోజ‌క‌వ‌ర్గ నేత‌లతో విభేదాలు వెర‌సి.. స‌మాధానం లేని ప్ర‌శ్న‌లుగా మిగులుతున్నాయి. అంతేగాక మాజీ మంత్రి గ‌ట్టిగా పోటీ ఇస్తుండ‌టంతో.. టీఆర్ఎస్‌లో చ‌ర్చ మొద‌లైంది. మాజీ మంత్రి బ‌రిలోకి దిగితే ప్రస్తుత మంత్రికి చెమ‌టలు ప‌ట్ట‌డంతో పాటు.. గెలుపు క‌ష్ట‌మ‌ని నివేదిక‌లు అందుతున్నాయ‌ట‌.

ఈటల వర్సెస్ పెద్దిరెడ్డి....

క‌రీంన‌గ‌ర్ జిల్లా హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న మంత్రి ఈటెల రాజేంద‌ర్‌కు ఈసారి ఎన్నిక‌ల్లో టీడీపీ నేత‌, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రూపంలో గ‌ట్టి పోటీ ఎదుర‌వ‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది. నియోజ‌క వ‌ర్గంలో ఎదుర‌నేదే లేకుండా సాగిపోతున్న ఆయ‌న‌కు ఈ మ‌ధ్య కాలం క‌లిసి రావ‌డం లేదని స్ప‌ష్టంగా తెలుస్తోంది. ఆయ‌న‌కు చెక్ చెప్పేలా పెద్దిరెడ్డి పావులు క‌దుపుతుండ‌టంతో నియోజకవర్గ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇంతకాలం టీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్‌ ఇలా ముక్కోణ పోటీ ఉన్న హుజురాబాద్‌లో ఇప్పుడు సీన్‌ మొత్తం మారిపోయింది. మంత్రి ఈటెల వర్సెస్‌ మాజీ మంత్రి పెద్దిరెడ్డి అన్నట్టు పరిస్థితి మారిపోయింది.

రేవంత్ తో పాటు....

రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడంతో... పెద్దిరెడ్డి కూడా ఆ వైపు చూస్తున్నారన్న ప్రచారం ఒక ప‌క్క బ‌లంగా జ‌రుగుతోంది. ఇటీవల తన అనుచరులు, ముఖ్యనేతలు, కార్యకర్తలతో పెద్దిరెడ్డి సమావేశం నిర్వహించి, వారి అభిప్రాయాలు సేకరించినట్లు తెలుస్తోంది. మంత్రి ఈటెల టార్గెట్‌గా పెద్దిరెడ్డి ఈ మధ్య బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు జనం భారీ సంఖ్యలో వచ్చారు. దీంతో పెద్దిరెడ్డి మరోసారి ఇక్కడి నుంచే పోటీచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉండ‌టం.. పెద్దిరెడ్డికి క‌లిసొచ్చే అంశం! ఈటల బీసీ నేత కావడం కూడా మైనస్‌ పాయింట్‌గానే భావిస్తున్నారు. ఒక‌వేళ పెద్దిరెడ్డి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేస్తే మంత్రి ఈటెలకు గెలుపు కష్టమేనన్న అభిప్రాయం నియోజ‌క‌వ‌ర్గంలో వ్యక్తమవుతోంది.

నమ్ముకున్న వారికి....

ఈటెల ఇంతకాలం ఒకేఒక్కడుగా చక్రం తిప్పినా పట్టు మాత్రం సాధించలేదు. ఆయ‌న‌ తీరుతో విసిగిపోయిన జమ్మికుంట జడ్పీటీసీ టీఆర్‌ఎస్‌కు రాజీనామా కూడా చేశారు. పార్టీని నమ్ముకున్న వారికి ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో ఉద్యమకారులు వ్యతిరేక గళం విప్పుతున్నారు. ఇదే స‌మ‌యంలో క‌రీంగ‌న‌ర్‌లోని 13 నియోజ‌క‌వ‌ర్గాల్లో గెల‌వాల‌నే దృఢ నిశ్చ‌యంతో ఉన్నారు. హుజురాబాద్‌లో మారుతున్న సమీకరణాలు, కెప్టెన్‌తో ఈటెలకు ఉన్న విబేధాలను బేరీజు వేస్తూ రిపోర్టు టీఆర్ఎస్ అధినేతకు అందించినట్లు సమాచారం. దీంతో ఈటెలకు స్థానం అనుమానమే అన్నసాగుతోంది. మ‌రి కేసీఆర్.. ఈటెల‌కు టికెట్ అక్కడే ఖాయం చేస్తారా? లేక మరోచోటకు పంపుతారా? అన్నది వేచిచూడాల్సిందే!!

Similar News