ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లాలో పార్టీలో విభేదాలను పరిష్కరించే పనిలో పడ్డారు. అయితే చిత్తూరులోని రెండు నియోజకవర్గాల్లో మాత్రం చంద్రబాబు ఆదేశాలను సయితం నేతలు లెక్క చేయడం లేదు. చిత్తూరు జిల్లాలో గత ఎన్నికల్లో టీడీపీకి భంగపాటు తప్పలేదు. చంద్రబాబు సొంత జిల్లాలోనే వైసీపీ ఆధిక్యతను కనపర్చింది. మొత్తం 14 శాసనసభ నియోజకవర్గాల్లో 8 నియోజకవర్గాలను వైసీపీ కైవసం చేసుకోగా, ఆరింటిలో మాత్రమే టీడీపీ విజయంసాధించగలిగింది. తర్వాత పలమనేరు నుంచి అమరనాధ్ రెడ్డి వైసీపీని వీడి టీడీపీలో చేరడంతో రెండు పార్టీల బలం సమానమయింది. అయినా వైసీపీకి చిత్తూరు జిల్లాలో ఏ మాత్రం హవా తగ్గలేదు. దీంతో చంద్రబాబు ఆ జిల్లాలో వచ్చే ఎన్నికల్లో అత్యధిక సీట్లను సాధించాలన్న పట్టుదలతో ఉన్నారు. అందుకోసమే అనారోగ్యంతో బాధపడుతున్న బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని తప్పించి యువకుడైన అమర్ నాధ రెడ్డి వైసీపీ నుంచి వచ్చినా మంత్రిపదవి కట్టబెట్టారు. ఇప్పుడు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వర్గ విభేదాలను పరిష్కరించాల్సిన బాధ్యత అమర్ నాధ్ రెడ్డిపైనే అధినేత పెట్టారు. మంత్రి అమర్ నాధ్ రెడ్డి కూడా వారంలో మూడు రోజులు జిల్లాలోనే మకాం వేసి పార్టీ నేతల్లో ఉన్న విభేదాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.
మదనపల్లి బీజేపీకేనా?
అయితే చంద్రగిరి, మదనపల్లి నియోజకవర్గాల్లో మాత్రం పార్టీ విభేదాలను అమర్ నాధ్ రెడ్డి సయితం పరిష్కరించలేక చేతులెత్తేశారట. మదనపల్లిలో అందరూ లీడర్లే. ఎవరికి వారే తమదే వచ్చే ఎన్నికల్లో సీటు అని చెప్పుకుంటూ తిరగడం తప్ప పార్టీని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. వీరి మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించాలని మంత్రి ఎంత ప్రయత్నించినా సాధ్యం కాకపోవడంతో వచ్చే ఎన్నికల్లో ఈ సీటును బీజేపీకి కేటాయించాలని అధిష్టానం నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక చంద్రగిరి నియోజకవర్గానికి వస్తే గల్లా అరుణకుమారికి, స్థానిక టీడీపీ లీడర్లకు అసలు పడటం లేదు. గల్లా అరుణకుమారి చంద్రగిరి నియోజకవర్గానికి ఇన్ ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. గల్లా కేవలం తన అనుచరులకే పెద్ద పీట వేస్తూ తొలి నుంచి పార్టీకి పనిచేస్తున్న వారిని పట్టించుకోవడం లేదన్న విమర్శ ఉంది. గల్లా పై అనేకసార్లు అధిష్టానానికి ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. మంత్రి సర్ది చెప్పేందుకు ప్రయత్నించినా ప్లాబ్లం సాల్వ్ కాలేదు. దీంతో గల్లా నియోజకవర్గమైన చంద్రగిరి ఆపరేషన్ చంద్రబాబు మాత్రమే చేయాలని మంత్రి అమర్ నాధ్ రెడ్డి నివేదిక ఇవ్వనున్నారట. మొత్తం మీద చంద్రబాబు సొంత జిల్లాలో తెలుగు తమ్ముళ్ల విభేదాలు కొంత పరిష్కారమయినా ఆ రెండు నియోజకవర్గాలు మాత్రం పార్టీకి కొరకరాని కొయ్యగా మారిపోయాయి.