ఆ మంత్రికి, స్పీక‌ర్‌కు స‌న్ స్ట్రోక్ త‌ప్ప‌దా..!

Update: 2018-01-07 13:30 GMT

వార‌స‌త్వ రాజ‌కీయాలు అంద‌రికీ క‌లిసిరావేమో..! కొంద‌రు వచ్చిన అవ‌కాశాన్ని అందిపుచ్చుకుని తండ్రికి త‌గ్గ త‌న‌యులుగా రాణిస్తారు. మ‌రికొంద‌రు తండ్రి రాజ‌కీయ భ‌విష్య‌త్‌ను కూడా ప్ర‌మాదంలో ప‌డేస్తారు. ఇప్ప‌డు నూత‌నంగా ఏర్ప‌డిన జ‌య‌శంక‌ర్‌భూపాల‌ప‌ల్లి జిల్లాలో ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. జిల్లాలో ఇద్ద‌రు ముఖ్య‌నేత‌లు త‌మ త‌న‌యుల ప‌నితీరుతో ఇబ్బందులు ప‌డుతున్నారు. భూపాల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే, స్పీక‌ర్‌ సిరికొండ మ‌ధుసూద‌నాచారి ముగ్గురు త‌న‌యులు ప్ర‌దీప్, ప్ర‌శాంత్‌, క్రాంతి ప్ర‌స్తుతం నియోజ‌క‌వ‌ర్గంలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నారు. వీరిని కాద‌ని చిన్న‌ప‌నికూడా జ‌ర‌గ‌ద‌ని జోరుగా ప్రచారం జ‌రుగుతోంది. అభివ‌ద్ధి ప‌నులు, ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లోనూ వీళ్లు చెప్పిందే వేదమ‌ని కార్య‌క‌ర్త‌లు,నాయ‌కులే బ‌హిరంగంగా చ‌ర్చించుకుంటున్నారు.

దురుసు ప్రవర్తనతో....

అధికారులు, కాంట్రాక్ట‌ర్లు, కార్య‌క‌ర్త‌ల‌తో కూడా దురుసుగా ప్ర‌వ‌ర్తిస్తార‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. కొద్ది నెల‌ల కింద‌ట జ‌రిగిన బొగ్గ‌ుగ‌ని కార్మిక సంఘం గుర్తింపు ఎన్నిక‌ల్లో టీబీజీకేఎస్ భూపాల‌ప‌ల్లిలో ఓడిపోవ‌డానికి కూడా వీరి వైఖ‌రే కార‌ణ‌మ‌నే ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. నియోజ‌క‌వ‌ర్గంలోని ఆరు మండ‌లాలు వీరు త‌లో రెండు మండ‌లాలు పంచుకుని మ‌రీ వ‌సూళ్లు చేసుకుంటున్నార‌న్న విమ‌ర్శ‌లు కూడా ఉన్నాయి. ఈ విష‌యం ముఖ్య‌మంత్రి కేసీఆర్ దృష్టిలో కూడా ఉంద‌ని ప‌లువురు చెబుతున్నారు. అప్ప‌టి నుంచి పార్టీ కార్య‌క్ర‌మాల్గొన‌డం, నియోజ‌క‌వ‌ర్గంలో కూడా ప‌ర్య‌టించ‌డం కొంత‌మేర‌కు త‌గ్గింద‌ని అంటున్నారు.

అపాయింట్ మెంట్ కూడా దొరక్క....

అయితే సింగ‌రేణి ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ మ‌ద్ద‌తుతో ఏఐటీయూసీ గెల‌వ‌డంతో స్పీక‌ర్‌కు సీఎం వ‌ద్ద ప‌లుకుబ‌డి త‌గ్గింద‌ని, అపాయింట్‌మెంట్ కూడా దొర‌క‌ని ప‌రిస్థితి నెలకొంద‌ని స్థానికంగా చ‌ర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండ‌గా స్పీక‌ర్‌ను రాజ్య‌స‌భ‌కు పంపించి, వచ్చే ఎన్నిక‌ల్లో మ‌రో కీల‌క నేత, ఇటీవ‌లే టీడీపీ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన‌ గండ్ర స‌త్య‌నారాయ‌ణ‌ను బ‌రిలో దింపే ఆలోచ‌న‌లో సీఎం ఉన్న‌ట్లు స‌మాచారం. ఇదే స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మ‌ల్యే గండ్ర వెంక‌ట‌ర‌మణారెడ్డి కూడా నియోజ‌క‌వ‌ర్గంలో విస్త‌'తంగా ప‌ర్య‌టిస్తున్నారు. కాంగ్రెస్ గెలిచినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేద‌ని ప‌లువురు అంటున్నారు.

మంత్రి కుమారుడిపై ఆరోపణలు....

ప‌ర్యాట‌క శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ త‌న‌యుడు ప్ర‌హ్లాద్ ప‌నితీరుపై కూడా స్థానికంగా తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఆయ‌న‌పై ఫోర్జ‌రీ సంత‌కం ఆరోప‌ణ‌లు, మ‌రెన్నో వివాదాల‌కు కేంద్ర‌బిందువుగా మారారు. ములుగు మార్కెట్ క‌మిటీ చైర్మ‌న్‌గా ఉన్న ప్ర‌హ్లాద్ ఇటీవ‌ల మ‌ళ్లీ తెర‌మీద‌కు వ‌చ్చాడు. మ‌హ‌బూబాబాద్ ఎంపీ సీతారాం నాయ‌క్‌ను కూడా టార్గెట్‌గా చేసుకుని ప్ర‌హ్లాద్ విమ‌ర్శ‌లు చేయ‌డం, త‌న తండ్రి శాఖ‌లో మితిమీరిన జోక్యంతో ఈ విష‌యం ఇంటిలిజెన్స్ రిపోర్టుల‌తో కేసీఆర్ వ‌ర‌కు వెళ్లిపోయింది. ఎస్టీ జాబితా నుంచి లంబాడీల‌ను తొల‌గించాల‌ని ఆదివాసీ గిరిజ‌నులు ఆందోళ‌న‌కు దిగ‌డంతో నియోజ‌వ‌ర్గంలో కొంత ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. మేడారం జాత‌ర క‌మిటీ విష‌యంలో జోక్యం చేసుకోవ‌డం కూడా మంత్రికి త‌ల‌నొప్పిగా మారింది. ఇక్క‌డ కూడా మాజీ ఎమ్మ‌ల్యే సీత‌క్క టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేర‌డంతో తీవ్ర‌పోటీ నెల‌కొనే అవ‌కాశం ఉన్న‌ట్లు ప‌లువురు భావిస్తున్నారు. ఏదేమైనా త‌న‌యుల తీరుతో తండ్రుల‌కు ఈసారి ఎన్నిక‌ల్లో టికెట్ ద‌క్క‌డం అనుమాన‌మేన‌ని ప్రచారం జ‌రుగుతోంది.

Similar News