ఆ భూమికి అంతే విలువ

Update: 2018-03-20 02:09 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రెండెకరాల స్థలాన్ని కొనుగోలు చేసిన వ్యవహారంపై వివాదం చెలరేగింది. ముఖ్యంగా జనసేనానిని టార్గెట్ చేసుకుని ఎకరం ఇరవై లక్షలకు అమరావతి సమీపంలో ఎలా కొనుగోలు చేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధానికి సమీపంలో ఖాజా వద్ద పవన్ కల్యాణ్ రెండు ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల పవన్ అందుకు భూమి పూజ కూడా చేశారు.

సొంత ఇంటి భూమి కొనుగోలు పై....

అయితే అమరావతికి సమీపంలో ఎకరం భూమి కోట్ల రూపాయలు విలువ చేస్తుండగా పవన్ కల్యాణ్ కు ఇరవై లక్షలకు ఎలా వచ్చిందన్న ప్రశ్నలను టీడీపీతో పాటు పలువురు ఇటీవల కాలంలో సంధిస్తున్నారు. అయితే దీనికి జనసేన పార్టీ ట్విట్టర్ ద్వారా సమాధానం ఇచ్చింది. పవన్ ఇంటికి సంబంధించి కొనుగోలు చేసిన డాక్యుమెంట్లతో సహా ట్విట్టర్లో ఆ పార్టీ ఉంచింది. తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయించిన మార్కెట్ విలువ ప్రకారమే పవన్ కల్యాణ్ ఆ భూమిని కొనుగోలు చేశారని పార్టీ పేర్కొంది.

ట్విట్టర్లో డాక్యుమెంట్లు....

ఆ భూమికి సంబంధించిన డాక్యుమెంట్లను కూడా ట్విట్టర్లో ఉంచింది. రిజిస్ట్రేషన్ కార్యాలయం నుంచి తీసుకున్న డాక్యుమెంట్లను కూడా బహిరంగంగా పెట్టింది. అనవసరమైన విమర్శలు చేయడం మాని, రాష్ట్రాభివృద్ధిపై దృష్టి పెట్టాలని జనసేన పార్టీ కోరింది. మొత్తం రెండు ఎకరాల 07 సెంట్ల భూమిని తాము 41 లక్షల 40 వేల రూపాయలకు కొనుగోలు చేసినట్లు పేర్కొంది. ఎవరికైనా అనుమానాలు ఉంటే తమ వద్దకు వస్తే నివృత్తి చేస్తామని పేర్కొంది.

Similar News