ఆ పేరెత్తడానికి చంద్రబాబు ఎందుకు ఇష్టపడటం లేదు....!

Update: 2017-12-12 04:30 GMT

పోలవరం ప్రాజెక్ట్ ప్రశ్నార్థకమా ? పేరిట రాజమహేంద్రిలో వైసిపి ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం కీలక తీర్మానాలు చేసింది. నీటిపారుదల శాఖలోని మాజీ ఉన్నతాధికారులు, టిడిపి తప్ప అన్ని పార్టీల నేతలు పాల్గొన్న అఖిలపక్షం చంద్రబాబు సర్కార్ తీరును ఏకిపారేసింది. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ఏపీ ప్రభుత్వం చేపడతామని తీసుకున్న నాటినుంచి జరిగిన జరుగుతున్న తప్పులను అన్ని పార్టీలు దుయ్యబట్టాయి. ప్రజలకు వాస్తవాలు చెప్పడానికి చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని సమావేశంలో నేతలు నిలదీశారు. ముఖ్యంగా కాఫర్ డ్యామ్ నిర్మాణాన్ని ఇంజనీర్లు సైతం తప్పుపట్టారు. డ్యామ్ నిర్మాణంలో తేడా వస్తే గోదావరి జిల్లాలు కనుమరుగు అవుతాయని ఇప్పటివరకు పనుల నాణ్యతకు సంబంధించి ఎలాంటి పర్యవేక్షణ లేకపోవడాన్ని అఖిలపక్షం ఎత్తి చూపింది.

అన్ని తప్పులే అన్న ఉండవల్లి ...

తొలినుంచి పోలవరం ప్రాజెక్ట్ అంశంపై అలుపెరగని గళం తో ప్రభుత్వ తప్పులు ప్రజలకు ఎత్తిచూపుతూ నిర్మాణాత్మక సూచనలు చేస్తున్న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ కుమార్ అఖిలపక్షం సమావేశంలో హైలెట్ గా నిలిచారు. ప్రాజెక్ట్ కోసం రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిద్దామని అంతా భావిస్తున్నా ఎవరు ఆ ప్రాజెక్ట్ పేరు ఎత్తడానికే చంద్రబాబు ఇష్టపడటం లేదని ప్రశ్నలు సంధించారు మాజీ ఎంపీ. ఆయన మిత్రుడు గత ఎన్నికల్లో తానే టిడిపిని గెలిపించాడని చెప్పుకుంటున్న పవన్ కళ్యాణ్ అడిగినా శ్వేతపత్రం ఎందుకు ప్రకటించకుండా వెనుకడుగు వేస్తున్నారని ఉండవల్లి నిలదీశారు. ఒక్క వైసిపి వారే పోలవరం పై సందేహాలు వ్యక్తం చేయడం లేదని, బిజెపి, సిపిఐ , సిపిఎం ఇతర ప్రజాసంఘాలు చివరికి మిత్రుడైన జనసేన పవన్ అడిగినా ఎందుకు శ్వేతపత్రం అని సీఎం బాధ్యతారహితంగా వ్యాఖ్యానించడం విడ్డురమన్నారు ఉండవల్లి. పోలవరం బాధితులు కోర్ట్ కి వెళ్లడం తప్పు ఎలా అవుతుందని, శ్వేతపత్రం ప్రకటిస్తే ప్రాజెక్ట్ ఆగిపోతుందనడం ఇదెక్కడి ప్రజాస్వామ్యమన్నారు ఆయన. ఢిల్లీ కి చంద్రబాబు అఖిలపక్షం తీసుకువెళ్లాలని ఆయన అందుకు అంగీకరించకపోతే బిజెపి నాయకుల సహకారంతో తామే వెళ్ళి గడ్కరీ ని కలుస్తామన్నారు అరుణ కుమార్.

మూడు కీలక తీర్మానాలకు అఖిలపక్షం ఆమోదం ....

సుదీర్ఘ చర్చ తరువాత అఖిలపక్షం మూడు తీర్మానాలను ఆమోదించింది. మొదటిది తక్షణం చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్ పై శ్వేతపత్రం విడుదల చేయాలని, రెండవది అఖిలపక్షాన్ని ఢిల్లీ కి తీసుకువెళ్లాలని, మూడోది కేంద్రమే ప్రాజెక్టును స్వాధీనపరుచుకుని పనులు పూర్తి చేయాలని తీర్మానించారు.

Similar News