ఆ..నాలుగు స్టేష‌న్లూ ఏం చెబుతున్నాయ్‌..?

Update: 2017-12-24 10:30 GMT

బండెళ్లి పోతోంది.. బ‌తుకు బండెళ్లి పోతోంది.. ఏళ్ల‌కు ఏళ్లు ఎటూ తేల్చ‌క రైలెళ్లి పోతోంది.. వెనుక‌బాటుత‌నాన్ని వ్వె... వ్వె... వ్వె అని వెక్కిరిస్తూ.. ఇంకా ఎంత కాలం.. విశాఖ జోన్ ఏర్పాటు ఇక క‌ల‌ల‌కే ప‌రిమితమా! ఏంటో మోడీ తేల్చ‌రు.. ఉత్త‌రాంధ్ర‌కు ఏ వ‌ర‌మూ ద‌క్క‌దు.ఇక్క‌డి ఎంపీలు పోరుబాట‌ప‌ట్ట‌రు. బాగుంది ఆదాయం మాది.. ద‌ర్జాలు ఒడిశా వారివా అన్న‌ది ఉత్త‌రాంధ్ర వాసుల ఆవేదన‌.. క‌నుక‌నే కొత్త జోన్ ఏర్పాటుపై ఉద్య‌మం ర‌గులుతోంది. ఓ తీవ్ర స్వ‌రం వినిపిస్తేనే ప్ర‌భుత్వాలు దిగివ‌స్తాయ‌న్న‌ది రాజ‌కీయ ప‌రిశీల‌కుల మాట‌.. ఈ నేప‌థ్యంలో ఎంపీ కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు అడుగు ముందుకు వేసి ప్రైవేట్ మెంబ‌ర్ బిల్ ప్ర‌వేశ‌పెట్టేందుకు చేస్తున్న స‌న్నాహాలు ఫ‌లిస్తే పార్లెమెంట్ వేదిక‌గా ఓ చ‌ర్చ జ‌రిగితే అప్పుడు కానీ తెలియ‌వు ఎవ‌రి మ‌న‌సులో ఏమున్న‌ది అన్న‌ది.. ఇప్ప‌టికే కేంద్రం ఏపీకి చేయాల్సిన సాయం క‌న్నా ఎక్కువ చేసింద‌ని గౌర‌వ బీజేపీ నేత‌లు త‌రుచూ వెల్ల‌డిస్తున్న మాట‌!

నిజమా? అబద్ధమా?

అది నిజ‌మో అబ‌ద్ధ‌మో తెల్సుకునే ముందు ఉత్త‌రాంధ్ర ప‌రిధిలో ఉన్న నాలుగు రైల్వే స్టేష‌న్ల గ‌తేంటో చూద్దాం. జ‌నాభా ఉన్నా ఆదాయం ఉన్నా జోన్ ఏర్పాటుకు సంబంధించి వాల్తేరు డివిజ‌న్ ప‌రిధిలో అన్ని మౌలిక వ‌స‌తులు ఉన్నా గుంటూరు, విజ‌య‌వాడ, గుంత‌క‌ల్లు, వాల్తేరు డివిజ‌న్ల‌ను క‌లిపి ఎందుకు స్పెష‌ల్ జోన్ గా ప్ర‌తిపాదించ‌ర‌న్న‌ది ఇవాళ ప్ర‌శ్న‌. దీనికి స‌మాధానం వెతికేముందు ఉత్త‌రాంధ్ర ప‌రిధిలో ప్ర‌ధాన‌మైన నాలుగు రైల్వే స్టేష‌న్లు అయిన దువ్వాడ‌, గజ‌ప‌తిన‌గ‌రం, శ్రీ‌కాకుళంరోడ్‌, తిలారు స్టేష‌న్లలో ప్ర‌స్తుతం నెల‌కొన్న స్థితి గ‌తులేంటో తెలుసుకుందాం. అంత‌కుమునుపు జోన్ ఏర్పాటువ‌ల్ల క‌లిసొచ్చే అంశాలేవో చూద్దాం రండి!

అదనపు రైళ్లు ఏవీ?

ఏనాటి నుంచి ఈస్ట్ కోస్ట్ ప‌రిధిలో ఉన్న విశాఖ వివ‌క్ష‌కు గుర‌వుతుంది అన్న‌ది ఓ వాస్త‌వం. ప్ర‌త్యే క సంద‌ర్భాల్లో డిమాండ్ ఉన్న మార్గాల్లో అద‌న‌పు రైళ్లు న‌డ‌ప‌కుండా వివ‌క్ష చూపుతున్నారన్న‌ది నూరు పైస‌ల నిజం. క‌నీస ప్రాధాన్యం ఈ ప్రాంతానికి ఇవ్వ‌డం లేదు. ఈ ప్రాంతానికి రావాల్సిన ఉద్యోగాలు, సౌక‌ర్యాలు, రిజ‌ర్వేష‌న్లు, ప‌దోన్న‌తుల్లో తీవ్ర న‌ష్టం వాటిల్లుతోంది.

ఉద్యోగ నియామకాలు కూడా...

కోటాల్లో , స్టాపింగ్‌ల్లో న్యాయం జ‌ర‌గ‌డం లేదు. జోన్ ఏర్పాటైతే స్ప‌ష్టంగా బ‌డ్జెట్లో ఎంత నిధులు కేటాయిస్తారో అన్న‌ది తెలుస్తుంది.త‌ద‌నుగుణంగా ఇక్క‌డే అనుబంధ బ‌డ్జెట్ ఒక‌టి ముఖ్య‌మంత్రి నేతృత్వానే రూపుదిద్దుకునే అవ‌కాశాలు మెండు. ప్ర‌త్యేక రైళ్ల అనుమ‌తులు, ఉద్యోగ నియామ‌కాలు ఇక్క‌డి నుంచే చేసుకోవ‌చ్చు. ఓ విధంగా చెప్పాలంటే రాష్ట్ర ప్ర‌భుత్వానికి జోన్ విష‌యంలో ఏ ఆలోచ‌న‌ను అమ‌లు చేయాల‌న్నా స్వీయ నిర్ణ‌యాధికారం ద‌క్కుతుంది అన్న మాట‌!

51 శాతం విశాఖ నుంచే...

ఈస్ట్ కోస్ట్ జోన్ కు వ‌చ్చే ఆదాయంలో 51 శాతం ఒక్క విశాఖ నుంచే ల‌భిస్తోంది. అయినా దానికి ప్రాధాన్యం ఇవ్వ‌డం లేదు. ఇక్క‌డ ఉద్యోగాలు పెంచాల్సింది పోయి లోటు ఉంద‌ని ఢిల్లీ పెద్ద‌లు స‌న్నాయి నొక్కులు నొక్కుతున్నారు. డ‌బ్లింగ్ ప‌నులు కూడా 90 శాతం ఒడిశాలోనే జ‌రుగుతున్నాయి. విద్యుదీక‌ర‌ణ కూడా ఎక్కువ‌గా అక్క‌డే జ‌రుగుతోంది. జోన్ ఏర్పాటైతే స్థానికుల‌కు ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు పెరుగుతాయి.

అది ప్ర‌త్య‌క్షంగా కావ‌చ్చు.. ప‌రోక్షంగానూ కావ‌చ్చు..

ప్ర‌స్తుతం విశాఖ నుంచి ప్ర‌త్యేకంగా దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల‌కు ర‌వాణా సౌక‌ర్యం లేదు. విశాఖ మీదుగా వెళ్తున్న రైళ్ల వ‌ల్లే ఈ సౌక‌ర్యం క‌లుగు తుంది. ఉత్త‌ర‌, ప‌శ్చిమ‌, ద‌క్షిణాది న‌గ‌రాలు ఢిల్లీ, చెన్నయ్‌, ముంబ‌యి, అహ్మ‌దాబాద్‌, బెంగ‌ళూరు, తిరువ‌నంత‌పురం వంటి న‌గ‌రాల‌కు నేరుగా ఇక్క‌డి నుంచి వెళ్తున్న రైళ్లు త‌క్కువే.. ఇటువంటి ఎన్నో స‌మ‌స్య‌లు పరిష్కారానికి నోచుకునేందుకు ఏకైక మార్గం విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు. ఇక ఉత్త‌రాంధ్ర ప‌రిధిలో ఉన్న ఆ నాలుగు స్టేష‌న్లలో ముఖ్యంగా శ్రీ‌కాకుళం జిల్లా ప‌రిధిలో ఉన్న శ్రీ‌కాకుళం రోడ్‌, తిలారు స్టేష‌న్ ల‌లో జ‌నాభా అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఉప‌యోగ‌ప‌డ‌డం లేదు.అదే విధంగా గ‌జ‌ప‌తి న‌గ‌రం కూడా! కాస్తో కూస్తో ప‌నులు చేప‌ట్టి చేతులు దులుపుకుంటున్నారే కానీ స్టేష‌న్ల ఆధునికీక‌ర‌ణ ఓ మిథ్య‌గానే మిగులుతోంది. ఇక దువ్వాడ స్టేష‌న్ గ‌తి కూడా ఇలానే ఉంది.

Similar News