ఆ జిల్లాలో పచ్చ పార్టీకి నష్టం తప్పదా?

Update: 2017-10-16 07:30 GMT

పశ్చిమగోదావరి జిల్లాలో తెలుగు తమ్ముళ్ల మధ్య విభేదాలు తీవ్రమవుతున్నాయి. నిన్నటి వరకూ చింతలపూడి నియోజకవర్గానికే పరిమితమైన విభేదాలు ఇప్పుడు ఏలూరు నియోజకవర్గానికి కూడా అంటుకున్నాయి. చింతలపూడి ఎంఎంసీ ఛైర్మన్ పదవి కోసం ఎమ్మెల్యే పీతల సుజాత, ఎంపీ మాగంటి బాబుల మధ్య ఉన్న విభేదాలు తీవ్ర రూపం దాల్చిన సంగతి తెలిసిందే. జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు రాజీనామా కూడా చేశారు. ఆ రాజీనామాలు ఏమయ్యాయో కూడా తెలీదు. జడ్పీ సీఈవో ఈ రాజీనామాలను ఆమోదించలేదు. కేవలం అధిష్టానంపై వత్తిడి తేవడానికే రాజీనామాల ప్రయోగం చేశారు. పార్టీ హైకమాండ్ కూడా రాజీనామాలపై సీరియస్ అయింది. రాజీనామా చేస్తే మీ డిమాండ్లకు తలొగ్గేది లేదని చెప్పడంతో వారు రాజీనామాలపై వెనక్కు తగ్గారు. చింతలపూడి ఎంఎంసీ ఛైర్మన్ పదవి ఇంకా భర్తీ కాలేదు. చంద్రబాబు కూడా ఈ పదవిని భర్తీ చేయకపోవడమే మేలన్న నిర్ణయానికి వచ్చారు. అలాగే తాడేపల్లి గూడెంలో మంత్రి మాణిక్యాలరావుకు, టీడీపీ నేతలకు మధ్య పొసగడం లేదు. మాణిక్యాలరావు దెబ్బకు ఇంటింటికీ టీడీపీ కార్యక్రమాన్నే కౌన్సిలర్లు బహిష్కరించారు.

ఏలూరు నియోజకవర్గంలోనూ.....

తాజాగా ఏలూరు నియోజకవర్గంలోనూ ఇదే రకమైన విభేదాలు తలెత్తాయి. ఏలూరు టీడీపీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి పై గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు తిరుగుబాటుకు దిగారు. ఏలూరుకు ఆనుకునే ఉన్న వెంకటాపురం పంచాయతీ ఏలూరు నియోజకవర్గంలో కీలకం. గెలుపోటములు ఈ పంచాయతీపైనే ఆధారపడి ఉంటాయి. ఈ నేపథ్యంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి అనుచరుల వ్యవహారాలను నిరసిస్తూ 9 మంది పంచాయతీ వార్డు సభ్యులు టీడీపీకి రాజీనామా చేశారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమేనేని ప్రభాకర్ హత్యకు కుట్ర పన్నిన కేసులో ప్రధాన నిందితుడైన టీడీపీ నేత రెడ్డి అప్పల నాయుడి హస్తం ఈ రాజీనామాల వెనక ఉన్నట్లు తెలుస్తోంది. చింతమేని ప్రభాకర్ హత్య కేసులో కుట్ర బయటపడిన వెంటనే రెడ్డి అప్పలనాయుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. తన సస్పెన్షన్ వెనక బడేటి బుజ్జి ఉన్నారని భావించిన రెడ్డి అప్పల నాయుడు తన వర్గం సభ్యులతో రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లాలో క్లీన్ స్వీప్ చేసిన టీడీపీ ఇప్పుడు కష్టాల్లో పడినట్లయింది. ప్రధాన నేతలందరూ అసంతృప్తి గళాలను విప్పుతూ రాజీనామాల బాట పడుతుండటం పార్టీ హైకమాండ్ ను కలవరపరుస్తోంది.

Similar News