తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతిపై మరింత అనుమానాలు బలపడుతున్నాయి. జయ 2016 డిసెంబరు 5వ తేదీన అపోలో ఆసుపత్రిలో మరణించిన సంగతి తెలిసిందే. ఆసుపత్రిలో ఉన్న75 రోజులూ ఆక్కడ ఉన్న సీసీటీవీలను స్విచాఫ్ చేసినట్లు చెప్పేశారు. చెప్పింది ఎవరో కాదు స్వయానా అపోలో ఆసుపత్రి ఛైర్మన్ సి. ప్రతాప్ రెడ్డి. ఆయన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. జయలలిత అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నన్ని రోజులూ సీసీ టీవీ కెమెరాలను పనిచేయకుండా చేశామన్నారు.
సన్నిహితుల కోరిక మేరకే....
జయలలిత ముఖ్యమంత్రి కావడంతో, ఆమె సన్నిహితుల కోరిక మేరకే ఈ పనిచేశామన్నారు. మొత్తం 24 గదులున్న ఐసీయూ ప్రాంతంలో ఇక ఎవరినీ ఉంచలేదని, ఆమె ఒక్కరినే ఉంచి చికిత్స అందించామన్నారు. తాను జయ మృతిపై ఏర్పాటు చేసిన కమిషన్ కు అన్ని ఆధారాలను సమర్పించామన్నారు సి.ప్రతాప్ రెడ్డి. అయితే సీసీటీవీ కెమెరాలను స్విచాఫ్ చేయడం వల్ల వాటిని సమర్పించలేకపోయామన్నారు. జయలలిత చికిత్స పొందిన 75 రోజులూ ఐసీయూలోకి ఎవరినీ అనుమతించలేదని చెప్పారు.
ఎవరినీ అనుమతించలేదు....
ఎవరినీ అనుమతించకూడదన్న జయ కుటుంబ సభ్యుల మేరకే ఆసుపత్రి యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. జయలలితను ఆ పరిస్థితుల్లో బయటకు చూపించడం వారికి ఇష్టం లేకపోయినందునే సీసీ కెమెరాలను స్విచాఫ్ చేశామని, ఎవరినీ అనుమతించలేదని చెప్పారు. జయలలితను చూసేందుకు కూడా వారి కోరికమేరకే సందర్శకులను అనుమతించలేదన్నారు. సన్నిహిత బంధువులు తప్ప ఎవరినీ ఐసీయూలోకి అనుమతించకూడదన్న నిబంధనను మాత్రమే తాము పాటించామని చెప్పారు. ఇలా అపోలో ఛైర్మన్ సీసీ టీవీ ఫుటేజ్ లేదని తేల్చి చెప్పడంతో జయ మరణం పై మరింత అనుమానాలు బయలుదేరాయి. మరోవైపు శశికళ పన్నీర్ సెల్వం, గవర్నర్ విద్యాసాగర్ రావు లాంటి వారు జయను ఆసుపత్రిలో చూశారని చెప్పడం కూడా అనుమానానికి తావిస్తోంది. మొత్తం మీద జయ మృతి కేసులో మరో సంచలన విషయం వెలుగుచూడటంతో అమ్మ మరణంపై మరింత అనుమానం పెరిగే విధంగా ఉంది.