ఆ కళాశాలలపై గంటా చర్యలు తీసుకుంటారా?

Update: 2017-10-16 01:30 GMT

కార్పొరేట్ కళాశాలలు మృత్యుకుహరాలుగా మారాయి. విద్యార్థులు తీవ్ర వత్తిడి తేవడం వల్లనే విద్యార్థులు అనేక మంది బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో చదువుల వత్తిడి తట్టుకోలేక అనేకమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కేవలం మూడు రోజుల వ్యవధిలోనే ఏడుగురు విద్యార్థులు మృతి చెందారు. వీరంతా కార్పొరేట్ కళాశాలలైన నారాయణ,చైతన్య విద్యాసంస్థలకు చెందిన వారే. ర్యాంకుల కోసం వారిపై కళాశాల యాజమాన్యం వత్తిడి తేవడం వల్లనే విద్యార్థులు మానసిక ఆందోళనకు గురై ఆత్మహత్యకు గురవుతున్నారు. ఈ వరుస సంఘటనలు ముఖ్యంగా ఏపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టాయి. ముఖ్యంగా నారాయణ కళాశాలల యజమాని మున్సిపల్ మంత్రి నారాయణ కావడంతో ప్రభుత్వం యాజమాన్యానికే సపోర్ట్ చేస్తుందన్న విమర్శలు విన్పిస్తున్నాయి.

నేడు యాజమాన్యంతో చర్చలు.....

అయితే కేవలం కార్పొరేట్ కళాశాలల్లోనే ఈ బలవన్మారణాలు జరగడంపై ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ఇటీవల ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు నారాయణ, చైతన్య కళాశాలల్లోని హాస్టల్స్ ను కూడా తనిఖీ చేశారు. దాదాపు 150 కార్పొరేట్ విద్యాసంస్థల్లో హాస్టల్స్ నిబంధనలకు విరుద్ధంగా నెలకొల్పారని ఏపీ విద్యాశాఖ అధికారుల విచారణల్లో తేలింది. అయితే వీటన్నింటినీ మూసివేయాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. సోమవారం అంటే ఈ నెల 16వ తేదీన అన్ని కళాశాలల యాజమాన్యంతో ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేసింది. కళాశాలల్లో బలవన్మరణాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సయితం వరుస ఆత్మహత్యలపై విచారం వ్యక్తం చేయడమే కాకుండా ఏ కళాశాల యాజమాన్యమైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. మరి నారాయణ, చైతన్యలపై చర్య తీసుకోవడం సాధ్యమైనా? ఇప్పటికే ఏపీలో వరుస వరుస ఆత్మహత్యలపై విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. దీనిని డైవర్ట్ చేయడానికే ఈ సమావేశం ఏర్పాటు చేశారా? అన్న అనుమానమూ కలుగుతోంది.

Similar News