టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో కొత్తగా ఏర్పడనున్న పార్టీకి తెలంగాణ జనసమితి పేరు దాదాపుగా ఖరారైంది. పార్టీ విధి విధానాలపై కసరత్తు తుది దశకు చేరుకున్నట్లు సమాచారం. అధికార టీఆర్ ఎస్ నుంచి పదిహేను మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని ఇటీవల కోదండరాం చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. మరోవైపు ఉద్యమకారులకే తమ పార్టీలో టికెట్ లు కేటాయిస్తామని కోదండరాం ప్రకటించారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నుంచి పెద్ద ఎత్తున వలసలు ఉంటాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
టెన్షన్ లో టీఆర్ఎస్....
కోదండరాం చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అధికార టీఆర్ఎస్‌లో పెద్ద ఎత్తున కలకలం రేపుతుంటే సీఎం కేసీఆర్‌కు సైతం టెన్షన్ పెట్టేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ పరిణామాలన్నింటినీ సీఎం కేసీఆర్ నిశితంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే టికెట్ల కేటాయింపుపై పలువురు ఎమ్మెల్యేలకు స్పష్టమైన హామీ ఇవ్వడం లేదని ఆ పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు. కోదండరామ్ ఎన్నికల్లో అనుసరించే వ్యూహాన్ని బట్టి అడుగులు వేయాలని ముఖ్యమంత్రి యోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే అధికార టీఆర్ ఎస్ పార్టీలో ఉద్యమ కారులకు సరైన గుర్తింపు దక్కడం లేదని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అధిష్ఠానం పై విమర్శలు సంధించడంపై పార్టీలో దుమారం రేగింది. శ్రీనివాస్‌గౌడ్ వ్యాఖ్యలకు పార్టీలోనే మరికొంత ఎమ్మెల్యేలు, పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి ఉన్న వాళ్లు, సీనియర్లు గొంతు కలుపుతుండడంతో అధికార పార్టీలో తొలిసారిగా ఈ రేంజ్‌లో ధిక్కారస్వరం బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో కోదండరామ్ పార్టీలోకి వచ్చే ఎన్నికల నాటికి పెద్ద ఎత్తున వలసలు ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు. పరిస్థితులను గమనిస్తున్న సీఎం కేసీఆర్ కోదండరామ్ పార్టీని కట్టడి చేసేందుకు పథకాలు రచిస్తున్నట్లు ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు.
కోదండను టార్గెట్ చేయడమే....
ఇక గత ఎన్నికల్లో టీఆర్ఎస్ మొత్తం 63 సీట్లు గెలుచుకుంటే ఇప్పుడు ఇతర పార్టీల నుంచి భారీ ఎత్తున వలసల నేపథ్యంలో ఆ పార్టీకి అసెంబ్లీలో మొత్తం బలం 88 ఉంది. వీరిలో కనీసం 40 మందికి టిక్కెట్లు రావంటున్నారు. వీరిలో చాలా మంది కూడా ఇప్పుడు కోదండరాం పార్టీ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. కొన్ని పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. ఇక ఈ పరిణామాలను ముందే గ్రహించిన కేసీఆర్ అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. కోదండరాం వైఖరిని అనుసరించే రానున్న ఎన్నికల్లో అధికార పార్టీలో టికెట్ల కేటాయింపు ఉండొచ్చని వారు భావిస్తున్నారు. ఏదేమైనా కేసీఆర్‌లో కోదండరాం గుబులు అయితే స్టార్ట్ అయినట్టే కనిపిస్తోంది. ఇప్పుడు కేసీఆర్‌కు విపక్ష కాంగ్రెస్‌ను ఎదుర్కోవడం కన్నా కోదండరాంను ఎదుర్కోవడమే పెద్ద టార్గెట్‌గా కనపడుతోంది. మరి కోదండరాం వర్సెస్ కేసీఆర్ ఎత్తులు పై ఎత్తులు తెలంగాణ రాజకీయాన్ని ఆసక్తిగా మార్చేస్తున్నాయి.