అస్థిపంజరాలతో వ్యాపారం .. ఇంత కిరాతకమా?

Update: 2018-02-23 18:29 GMT

తమిళనాడు రాష్ట్రంలో ఘోరమైన నిజం ఆలస్యంగా వెలుగు చూసింది. కాంచీపురంలో నిర్వహిస్తున్న వృద్ధాశ్రమంలో వృద్ధులను చంపి వారి అస్థిపంజరాలు ఎగుమతి చేస్తున్న సంఘటన సభ్య సమాజాన్ని షాక్ కి గురిచేసింది. సెయింట్ జొషెఫ్ కరుణయ్యి ఇల్లెయ్యి అనే వృద్ధాశ్రమం నడుస్తుంది. ఇందులో సుమారు 300 లమందికి పైగా వృద్ధులు వుంటున్నారు. విదేశీ విరాళాలతో నిర్వహిస్తున్న ఈ ఆశ్రమం పేరుకే వృద్ధులకు సేవ చేస్తున్న ప్రచారం సాగిస్తూ తెరవెనుక హత్యావ్యాపారానికి శ్రీకారం చుట్టింది. ఆశ్రమంలో ప్రతి నెల పదుల సంఖ్యలో వృద్ధులను చంపి ఒక గ్రిల్ పై పడుకోబెట్టేవారని వ్యవహారం వెలుగులోకి వచ్చాక పోలీసుల విచారణలో తేలింది. వారి మృత దేహాలు కుళ్లిపోయాక అస్థిపంజరాలు మాత్రం ఎగుమతి చేసినట్లు తేలడంతో ఖాకీలు సైతం అవాక్కయ్యారు.

ఎలా బయటపడింది....

రోడ్డుపై వెళుతున్న ఒక కూరగాయల వ్యాన్ లోనుంచి బిగ్గరగా కేకలు వినపడటంతో అనుమానం వచ్చిన స్థానికులు ఆ వాహనం అడ్డగించారు. అందులో ఇద్దరు వృద్ధులు ఒక శవంతో ఉండటాన్ని చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ వృద్ధులను విచారించి ఆశ్రమాన్ని తనిఖీ చేస్తే ఈ దుర్మార్గం బయటపడింది. వ్యాన్ లో వెళుతున్న వృద్ధులను వేరే వృద్ధాశ్రమం నుంచి కాంచీపురం తరలిస్తున్నట్లు తేలింది. దాంతో లోతుగా విచారణ చేపట్టి ఖాకీలు కేసు డీల్ చేస్తున్నారు. చాలా కాలం నుంచి ఆశ్రమం వెనుకనుంచి దుర్గంధం వస్తుందని స్థానికులు ఇప్పుడు తెలియచేస్తున్నారు. ఆశ్రమంలో చేరుతున్న వృద్ధుల సంఖ్యకు అక్కడ వున్నవారికి మధ్య లెక్కల్లో సైతం చాలా తేడా ఉండటంతో వీరిని చంపి అస్థిపంజరాలు ఎక్కడికి పంపుతున్నారన్న అంశంపై దర్యాప్తు మొదలైంది. సెయింట్ జొషెఫ్ కి చెందిన దిండిగల్, వేలూరు ప్రాంతాల్లో వున్న మరో రెండు ఆశ్రమాలపై కూడా ఇప్పుడు పోలీసులు తనిఖీలు మొదలు పెట్టారు. అత్యంత అమానవీయంగా సాగుతున్న ఈ దారుణం ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనమే అయ్యింది. తమ పిల్లలకు దూరంగా శేష జీవితాన్ని గడుపుతున్న పండుటాకులపై కనీస దయా దాక్షిణ్యం లేకపోవడం అందరిని కన్నీరు పెట్టిస్తుంది. ఈ కేసులో నిందితుల్ని తీవ్రంగా శిక్షించాలని అంతా ముక్త కంఠంతో కోరుతున్నారు.

Similar News