కృష్ణా నదిలో పడవ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 22 మంది కుటుంబాలకు ఎవరు భరోసా ఇస్తారు. ఈ పాపం ఎవరిదంటే...? విచారణలో అనేక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రభుత్వం అత్యుత్సాహం, అధికారుల కాసుల కక్కుర్తి ఇందుకు తోడయ్యాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. పట్టిసీమ నుంచి నీళ్లు తీసుకొచ్చి అక్కడ పవిత్ర సంగమమని ప్రభుత్వం ముద్ర వేసింది. దాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృష్ణా, గోదావరి నీళ్లు కలిసే ప్రాంతంలో నిత్య హారతులను ఏర్పాటు చేసింది. వీటిని చూసేందుకు జనం ఎగబడుతున్నారు. కేవలం అమరావతి దృష్టిని ఆకర్షించడానికే ప్రభుత్వం పవిత్ర సంగమాన్ని సృష్టించిందన్న విమర్శలు విన్పిస్తున్నాయి.
అధికారులే పెట్టుబడిదారులు....
మరోవైపు అధికారులు కూడా కాసుల కక్కుర్తికి అలవాటు పడిపోయారు. పవిత్రసంగమం వద్ద పర్యాటకలు సంఖ్య పెరగడంతో అధికారులు రంగంలోకి దిగారు. దుర్గమ్మ దర్శనం చేసుకున్న అనంతరం హారతులు చూసేందుకు జనం క్యూకడుతుండటంతో అధికారులు బోట్లు కొనుగోలుచేశారు.తమ పెట్టుబడితోనే అక్రమార్జనకు తెరతీసేందుకు బోట్లు కొనుగోలు చేశారు. టూరిజం తాత్కాలిక డ్రైవర్ గేదెల శ్రీను, టూరిజం కార్పొరేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ కొల్లి శ్రీధర్ లు తమ మామ పేరిట పెద్దయెత్తున పెట్టుబడులు పెట్టారు. నిబంధనల ప్రకారం బోటు తిరగడానికి అనుమతివ్వాల్సి ఉండగా అధికారులు పట్టించుకోలేదు. గతంలో ఐదు బోట్లు ఉంటే హారతులు పెట్టిన తర్వాత వీటి సంఖ్య 30కి పెరిగాయి. నాలుగు ప్రయివేటు సంస్థలు ఈ ప్రయివేటు బోట్లను నడుపుతున్నాయి. ప్రయివేటు సంస్థలకు టూరిజాన్ని అప్పగిస్తే ఇంతే జరగుతుందన్నది అధికారులకూ తెలియంది కాదు. పున్నమి ఘాట్లో స్పైడర్ నెట్ ను ఏర్పాటు చేశారు. గతంలో దానిని ప్రయివేటు వారికి అప్పగించడంతో ఫీజు వసూలు చేస్తున్నారు. ఇక పర్యాటకులు సరదాగా నడవటానికి బర్మా బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. దీనిపై నడిచేందుకు తొలినాళ్లలో ఉచితంగానే అనుమతించేవారు. దీన్ని కూడా ప్రయివేటు సంస్థకు అప్పగించడంతో బర్మా బ్రిడ్జిపై నడవటానికి మనిషికి వందరూపాయలు నిర్దాక్షిణ్యంగా వసూలు చేస్తున్నారు. ప్రమాదానికి గురైన పడవకు కూడా అనుమతి లేవన్న సంగతి తెలిసిందే. తీరా ప్రమాదం జరిగిన తర్వాత ఏడుగురు టూరిజం ఉద్యోగులపై చర్యలు తీసుకుంది. కాని ఇన్నాళ్లూ జరుగుతున్నా పట్టించుకోని ఉన్నతాధికారులు, ఆ మంత్రిత్వశాఖను మాత్రం ప్రభుత్వం వదిలేసిందన్న విమర్శలు విన్పిస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా కృష్ణా నదిలో హారతిపై చూపిన శ్రద్ధ పర్యాటకుల భద్రతపై పెట్టాలని కోరుతున్నారు.