అవ‌స‌ర‌మా బాబూ?

Update: 2018-02-27 03:30 GMT

ఏపీ ఖ‌జానా కొల్లబోయింది. లోటు బ‌డ్జెట్లో ఉన్నాం. ఉద్యోగుల‌కు జీతాలు ఇచ్చేందుకు సైతం క‌ట‌క‌ట లాడుతున్నాం. కాస్ట్ క‌టింగ్ మంత్రం ప‌ఠించాల్సిందే! - గ‌త వారం కింద‌ట ఏపీ ఆర్థిక మంత్రి య‌న‌మ‌ల రామకృష్ణుడు చెప్పిన మాట ఇది. దీనికి కొన‌సాగింపుగా.. చంద్రబాబు సైతం అవును నిజ‌మే.. ఏపీ ప‌రిస్థితి అడ్డదిడ్డంగా ఉంది. అప్పులు సైతం పుట్టే ప‌రిస్తితి లేదు. అన్నారు. ఇది నిజ‌మే కావొచ్చు! కేంద్రం నుంచి స‌రైన స‌మ‌యంలో స‌రైన విధంగా ఆర్థిక సాయం అంద‌ని కార‌ణం గా రాష్ట్ర ప‌రిస్థితి ఇబ్బందుల్లోనే ఉంది. అలాంటి స‌మ‌యంలో చంద్రబాబు ఎలా వ్యవ‌హ‌రించాలి? ఏ విధంగా ఆర్థిక ప‌రిస్థితిని చ‌క్కదిద్దుకునే కార్యక్రమం చేప‌ట్టాలి? అంద‌రూ ఇవే ప్రశ్నలు సంధించారు.

ఇంత ఖర్చయితే ఎలా?

ఇప్పుడున్న ప‌రిస్థితిలో ఇక‌, చంద్రబాబు ఖ‌ర్చుల్లో కోత పెడ‌తార‌ని, క‌నీస ఖ‌ర్చుల‌ను సైతం త‌గ్గించుకుంటార‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే, ఆయ‌న మాత్రం మారిన‌ట్టు క‌నిపించ‌డం లేదు. దుబారా ఖ‌ర్చుకు ఎక్కడా వెన‌క్కి త‌గ్గడం లేదు. త‌న చేతికి ఎముక లేన‌ట్టుగానే బాబు వ్యవ‌హ‌రిస్తున్నారు. పోనీ, దుబారా చేస్తున్నార‌ని అనుకున్నా.. అవ‌స‌ర‌మైన విష‌యాల్లో కొద్దిగా ఎక్కువ ఖ‌ర్చు చేసినా ఏ ఒక్కరూ ప‌ట్టించుకోరు. కానీ, అన‌వ‌స‌ర‌మైన ఆర్భాటానికి కూడా ఈ స‌మ‌యంలో చంద్రబాబు పెద్ద పీట వేస్తుండ‌డం అంద‌రినీ క‌ల‌చి వేస్తున్న ప‌రిణామం.

అదే జరిగితే మంచిదే.....

విష‌యంలోకి వెళ్తే.. విశాఖ‌ప‌ట్నంలో మూడు రోజుల పాటు జరిగిన సీఐఐ స‌ద‌స్సును రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర భాగ‌స్వామ్యంలో నిర్వహిస్తోంది. మొత్తంగా 55 దేశాల‌కు చెందిన వ్యాపార దిగ్గజాల‌ను ఇక్కడ‌కు పిలిపించి, ఏపీ ప‌రిస్థితిని వివ‌రించి.. ఇక్కడున్న సానుకూల‌త‌ల‌ను వారికి తెలిపి.. ఇక్కడ పెట్టుబ‌డులు పెట్టించేలా వారిని ప్రోత్సహించాల‌ని నిర్ణయించారు. ఫ‌లితంగా ఏపీకి పెట్టుబ‌డుల కింద న‌గ‌దు రావ‌డంతోపాటు.. ప‌రిశ్రమ‌ల ఏర్పాటు జ‌రుగుతుంది. ప్రపంచం మొత్తం ఏపీ వైపు చూస్తుంది. మ‌న యువ‌త‌కు భారీ ఎత్తున ఉపాధి కూడా క‌లుగుతుంది. దీనిని ఎవ‌రూ త‌ప్పు ప‌ట్టాల్సిన అవ‌స‌రం లేదు. అయితే, ఈ విష‌యంలోనే చంద్రబాబు చేస్తున్న ''అతి''పై అంద‌రూ చ‌ర్చించుకుంటున్నారు.

పరిస్థితి చక్కబడేనా?

ఇదేంటి ఈ ప‌రిస్థితిలో కూడా బాబు ఇక మార‌రా? అని అనుకుంటున్నారు. ఎందుకంటే.. సీఐఐ స‌ద‌స్సుకు సంబంధించిన వాణిజ్య ప్రక‌ట‌న‌లను ఏపీ, తెలంగాణ‌ల్లోని అన్ని తెలుగు మీడియాల్లోనూ విస్తృతంగా ప్రచారం చేశారు. దీనికిగాను రూ.కోట్లు ఖ‌ర్చు చేసిన్నట్టు అమ‌రావ‌తి వ‌ర్గాలు చెబుతున్నాయి. 'సీఐఐ స‌ద‌స్సును విజ‌య‌వంతం చేయండి'- అనేది ఈ యాడ్ సారాంశం. అయితే, ఇది లోక‌ల్ ప్రోగ్రాం కాదుక‌దా? అనేది ప్రధాన ప్రశ్న. దీనికి స్థానికంగా ఎలాంటి ప్రతిపాద‌న‌లూ లేన‌ప్పుడు ప్రపంచ వ్యాపారులే ల‌క్ష్యం అయిన‌ప్పుడు అంత‌ర్జాతీయ స్థాయిలో ప్రక‌ట‌న‌లు ఇచ్చుకుంటే ఖ‌ర్చుక‌లిసి వ‌స్తుంది క‌దా? ఇక్కడ డ‌బ్బా ప్రచారం ఎందుకు? అనేది ప్రధాన ప్రశ్న. అయిన‌ప్పటికీ. బాబు ఎవ‌రి మాటలూ వినిపించుకునే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. ఇంట‌ర్నేష‌న‌ల్ ప్రోగ్రాంకి కూడా ఇక్కడ ప్రచారం గుమ్మెక్కుతోంది. మ‌రి దీనివ‌ల్ల ఎవ‌రికి లాభం? అంటే.. మీడియా సంస్థల‌కు త‌ప్ప ఎవ‌రికీ కాద‌నేది తెలుస్తూనే ఉంది. అయితే, బాబుకు మాత్రం పాప్యులారిటీ పెరుగుతోంది. మ‌రి ఎప్పటికి ఏపీ ప‌రిస్థితి చ‌క్కబ‌డుతుందో ఆయ‌న‌కే తెలియాలి.

Similar News