టీడీపీలో అవినీతి లేదా ప‌వ‌న్..?

Update: 2017-12-08 04:00 GMT

జ‌న‌సేనాని మ‌రోసారి జ‌నంలోకి వ‌చ్చాడు. ఈసారి స్ప‌ష్ట‌మైన లక్ష్యంతో.. భ‌విష్య‌త్ కార్యాచ‌రణ‌పై కాస్తంత క్లారిటీతో వ‌చ్చిన‌ట్టే కనిపిస్తున్నాడు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌! ఈసారి వ‌స్తూ వ‌స్తూనే వైసీపీ అధినేత లక్ష్యంగా తీవ్రంగా విమ‌ర్శ‌లు సంధించాడు. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ-బీజేపీ త‌ర‌ఫున నిల‌వ‌డానికి జ‌గ‌న్ అవినీతే కార‌ణ‌మంటూ కొద్దిగా క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశాడు. అయితే ప‌వ‌న్ ప్ర‌సంగంలో ఒక కొత్త విష‌యాన్ని క‌నిపెట్టార‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. అదేంటంటే.. ప్ర‌స్తుతం టీడీపీ ప్ర‌భుత్వంపై అనేక అవినీతి ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. అన్నింటిలోనూ అవినీతి రాజ్య‌మేలుతోంద‌ని కాగ్ కూడా తేల్చిచెప్పింది. అయినా ఇవేమీ ప‌వ‌న్ వ‌ద్ద‌కు చేర‌లేదో ఏమోగానీ.. ఇంకా జ‌గ‌న్ అవినీతి గురించి ప‌దేప‌దే ప్ర‌స్తావించ‌డమేంట‌నే సందేహాలు అంద‌రిలోనూ వెల్లువెత్తుతున్నాయి.

టీడీపీలో అవినీతి కన్పించలేదా?

రాజ‌ధాని భూముల కొనుగోలులో, పోల‌వ‌రం ప్రాజెక్టు, ఇసుక దోపిడీ, కాంట్రాక్టులు ఇలా ప్ర‌తి అంశంలోనూ ఏపీ ప్ర‌భుత్వం తీవ్రంగా విమ‌ర్శ‌లు ఎదుర్కొంటోంది. అన్నింటా టీడీపీ నాయ‌కులు క‌మీష‌న్ల కోసం కక్కుర్తి ప‌డుతున్నార‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఇవేమీ జ‌న‌సేనాని వ‌ద్ద‌కు చేర‌లేదో ఏమో.. పాత చింత‌కాయ ప‌చ్చ‌డిలా జ‌గ‌న్ అవినీతి గురించి ప‌దేప‌దే చెబుతున్నారు. జనసేన అధినేత పవన్ చంద్రబాబు పాలనలో 'జగన్ అవినీతి' క‌నిపెట్టార‌నే సెటైర్లు వినిపిస్తున్నాయి. వైఎస్ జమానాలో సాగిన అవినీతి వ్యవహారాలను ప్రధాన పత్రికలు అన్నీ అప్పట్లోనే పెద్ద ఎత్తున ఎత్తి చూపాయి. ఆ తర్వాత జరిగిన పరిణామాలపై సీబీఐ కేసులు నమోదు అయ్యాయి..జగన్ వాటిని ఎదుర్కొంటున్న విష‌యం తెలిసిందే!

నాలుగేళ్లలో ఏం జరిగిందో..?

ఇప్పుడు చంద్రబాబు పాలనలోనూ ప‌వ‌న్ నాటి అవినీతి గురించే మాట్లాడుతున్నారు త‌ప్ప‌.. నాలుగేళ్ల‌లో జ‌రిగిన‌, జ‌రుగుతున్న అవినీతిపై క‌నీసం స్పందించినది లేదు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా వైఎస్ అవినీతిపై తీవ్ర ఆరోపణలు చేశారు. తాము అధికారంలోకి వస్తే అక్రమాలకు పాల్పడిన వారందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని, వారి ఆస్తులు స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు. అధికారంలోకి వచ్చి ఇన్నేళ్లు దాటినా ఇప్పటి వరకూ ఏ రంగంలోనూ ఒక్కరంటే ఒక్కరిపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. అన్ని ఆధారాలు దగ్గర పెట్టుకుని టీడీపీ సర్కారు కానీ.. చంద్రబాబు కానీ ఎందుకు ఒక్కరిపై చర్య తీసుకోలేకపోయారనే ప్ర‌శ్న మొద‌లైంది.

భారీ దోపిడీ కళ్లకు కనపడలేదా?

ఈ విషయాన్ని పవన్ ఎందుకు ప్రస్తావించలేకపోయారు. పైగా ఎప్పుడో జరిగిపోయిన అవినీతి గురించి ప్రస్తావించిన పవన్.. ప్రస్తుతం చంద్రబాబు జమానాలో సాగునీటి ప్రాజెక్టులు..పరిశ్రమలు, అమరావతి పేరుతో సాగుతున్న భారీ దోపిడీ గురించి ఎందుకు ప్రశ్నించటం లేదు. పవన్ నిజంగా ఫీల్డ్ లో దిగితే ప్రస్తుత అవినీతిని అడ్డుకోవచ్చు కదా? మరి ఆ పని వదిలేసి.. పత్రికల్లో విస్తృతంగా వచ్చిన, అందరికీ తెలిసిన వైఎస్ జమానా అవినీతి గురించి మాత్రమే ప్రస్తావించి.. ప్రస్తుత ప్రభుత్వంలోని అవినీతి గురించి అలా ఓ ముక్క మాట్లాడి వదిలేయటం వెనక మతలబు ఏంట‌నే సందేహాలు అందరిలోనూ వినిపిస్తున్నాయి. రూల్ అంద‌రికీ ఒక‌లాగే ఉండాలిగాని... అస్మ‌దీయుల‌కు ఒక‌లా.. త‌స్మ‌దీయుల‌కు మ‌రోలా ఉండ‌కూడ‌దు క‌దా!!

Similar News