నాలుగేళ్ల తెలంగాణ కొత్త రాష్ట్రంలో శాసనసభ సమావేశాలను హుందాగా జరుపుకుంటున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. నిర్ణయం కఠినమే అయినా తప్పదన్నారు. కాంగ్రెస్ సభ్యులపై వేటు వేసిన సందర్భంగా ముఖ్యమంత్రి సభలో ప్రసంగించారు. నేరుగా సభలోనే ఈ సంఘటనలు దురదృష్టకరమని అన్నారు. తాము టార్గెట్ చేసింది గవర్నర్ నేనని కాంగ్రెస్ సభ్యులు సభ అయిన తర్వాత చెప్పడం వారి మానసిక పరిస్థితికి అద్దంపడుతోందన్నారు. తెలంగాణ వచ్చిన ఐదో రోజే కాంగ్రెస్ తన దిష్టిబొమ్మలు తగలపెట్టిందన్నారు. 2014 ఎన్నికలు పూర్తయిన తర్వాత అనేక ఎన్నికలు వచ్చాయని, ఏ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవలేదన్నారు. నాలుగేళ్ల నుంచి తన ఆరోగ్యంపై విష ప్రచారం చేస్తున్నారన్నారు. ఇంత దారుణంగా కాంగ్రెస్ వ్యవహరిస్తుందనుకోలేదు. ఆరునూరైనా సరే తాను ప్రజలకు జవాబుదారీగా ఉంటానని, శాంతిభద్రతలకు విఘాతం కలిగితే ఊరుకోనన్నారు. తన పరిపాలన చూసి అరాచకాలు చేస్తామంటే ఊరుకోబోనని హెచ్చరించారు. ఎవరైనా సరే తాను ఉపేక్షించేది లేదని చెప్పారు. ఏ అంశంపైనేనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పినా కాంగ్రెస్ అసహనం ప్రదర్శిస్తుందన్నారు. కావాలనే గొడవ చేశారన్నారు. ఎన్నిరోజులైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామన్నప్పుడు ఇక రచ్చ ఎందుకు చేస్తున్నారన్నారు. కౌన్సిల్ ఛైర్మన్ నాటకాలాడుతున్నారనడం విడ్డూరంగా ఉందన్నారు. సభలో గొడవ చేయాలని ముందుగానే నిర్ణయించుకున్నారని, ఆ సమాచారం తమకు వచ్చిందన్నారు. అందుకోసమే భద్రతను పెంచాల్సి వచ్చిందన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీ పడబోమని, సరైన నిర్ణయం తీసుకున్నారని కేసీఆర్ అన్నారు. ప్రజలే సరైన తీర్పు చెబుతారని అన్నారు.