అన్నాడీఎంకేలో అందరూ ఒక్కటై పోతారా? పన్నీర్, పళని వర్గాలు శశికళ బ్యాచ్ ను కూడా కలుపుకుని వెళతాయా? పరిస్థితులు చూస్తుంటే అలాగే కన్పిస్తోంది. ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంల మధ్య ఇటీవల విభేదాలు తలెత్తాయి. అయితే తామిద్దరమూ ఒకటేనని ప్రకటించారు. ఇటీవల జరిగిన పార్టీ వార్షికోత్సవంలో ఇద్దరూ ఒకే వేదికపైకి వచ్చి క్యాడర్ అనుమానాలను తీర్చారు. మరోవైపు పార్టీ సీనియర్ నేత తంబిదురై వ్యాఖ్యలు కూడా లీడర్లు, క్యాడర్ లో కొంత అయోయమానికి గురి చేశాయి. టీటీవీ దినకరన్ కూడా త్వరలోనే పార్టీలోకి వస్తారని తంబిదురై చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపాయి. కొందరు మంత్రులు తంబిదురై వ్యాఖ్యలపై మండిపడ్డారు కూడా. అయితే పన్నీర్, పళనిలు వారిని సముదాయించే యత్నం చేశారు. అలాగే తంబిదురై వ్యాఖ్యలను టీటీవీ దినకరన్ స్వాగతించడం విశేషం. పార్టీ బలోపేతం కావాలంటే అన్ని వర్గాలూ కలసి పనిచేయాల్సిందేనని నిర్ణయానికి వచ్చారు.
ఎన్నికలు కారణంగానే....?
తమిళనాడులో త్వరలో ఆర్కేనగర్ ఉప ఎన్నిక ఉంది. ఈ ఎన్నిక పార్టీకి ఛాలెంజ్. ఈ ఎన్నికల్లో విపక్షాలు గెలిస్తే తమకు భవిష్యత్ ఉండదన్నది అన్నాడీఎంకేలోని అన్ని వర్గాల అభిప్రాయం. ఇటీవల పెరోల్ పై చెన్నైకి వచ్చిన శశికళ కూడా కొంత మెత్తపడ్డారు. పార్టీలో అన్ని వర్గాలు కలిసి పనిచేయడానికి తనకు అభ్యంతరం లేదన్న సంకేతాలు పంపారు. కేవలం ఆర్కే నగర్ ఉప ఎన్నిక మాత్రమే కాకుండా తమిళనాడులో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. గత ఏడాది సెప్టంబరుతోనే వీటి పదవీకాలం ముగిసింది. అయితే ఈ నెల 17,19 వతేదీల్లో వీటికి ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ కూడా జారీ అయింది. అయితే రిజర్వేషన్ల విషయంలో కొందరు న్యాయస్థానం ఆశ్రయించడంతో అది పెండింగ్ లో ఉంది. ఏ సమయంలోనైనా కోర్టు తీర్పు వచ్చి స్థానిక సంస్థలకు కూడా ఎన్నికలు జరిగే అవకాశముంది. ఈ నేపథ్యంలోనే వైరి వర్గాలన్నీ ఒకటవుతాయంటున్నారు. అందరూ ఒక్కటైతేనే ప్రత్యర్థి పార్టీలను ఈ ఎన్నికల్లో ఎదుర్కొనగలమన్న భావనకు వచ్చారు. మరి ఇది జరుగుతుందా? లేదా? అన్నది చూడాలి. మరోవైపు రెండాకుల గుర్తుపై ఈ నెల 23వ తేదీన ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంటుంది. మొత్తం మీద తమిళనాడు రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరిగే అవకాశముంది.