అయ్యో జేసీ తలపోటు తెస్తున్నారే?

Update: 2018-02-23 04:30 GMT

సంప్రదాయ మీడియా అయితే అధికార పార్టీ చెప్పుచేతల్లో నడుస్తుంది. అందులో ఏపీలో మెజారిటీ వర్గం మీడియా చంద్రబాబు అనుకూలమే అన్నది అందరి భావన. ఇప్పుడు సోషల్ మీడియా రోజులు రాజ్యం ఏలుతున్న కాలం. నేతలు తమ ప్రతి కదలికలో జాగ్రత్త పడకపోతే రాత్రికి రాత్రే బికాం లో ఫిజిక్స్ జలీల్ ఖాన్ లా ప్రజల్లో నవ్వుల పాలౌతారు. రెండు రోజుల క్రితం 20 కోట్ల రూపాయల టెండర్ల అంశంలో మంత్రి ఆదినారాయణ అనుచరగణం ఎంపీ సీఎం రమేష్ కార్యాలయం పైనే పడిపోయి నానా గోలా చేసింది. ఇది సీఎం స్థాయిలో తేల్చుకుంటామనే వరకు వెళ్ళింది. ఆ టెండర్ల ప్రక్రియకు సీఎం రమేష్ వత్తిడితో గడువు ను అధికారులతో పొడిగింపు చేశారనేది మంత్రి ఆదినారాయణ వర్గీయుల వాదన. వాయిదా పడ్డ టెండర్లకు గురువారం చివరిరోజుగా ఉండటంతో కడప జిల్లాలో భారీ భద్రత ఏర్పాటు చేశారంటే పరిస్థితి ఎంత దిగజారిందో చెప్పక చెప్పినట్లే.

జెసి వీడియో కలకలం ...

మంత్రి ఆదినారాయణ రెడ్డి, సీఎం రమేష్ టెండర్ల పంచాయితీ తేలకుండానే అనంతపురం జిల్లా టిడిపి లో జెసి దివాకర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాధ రెడ్డి నడుమ మరో కొత్త వివాదం సోషల్ మీడియా లో వెలుగు చూసింది. తనకు ఉపయోగపడతాడని 10 లక్షల కాంట్రాక్ట్ పనులు జెసి వైసిపి నేత ఒకరికి సిఫార్స్ చేసి ఆయన్ను తనవైపు తిప్పుకునే పాచిక విసిరారు. ఈ కాంట్రాక్టుపై కన్నేసిన మాజీ మంత్రి అనుచరులు వైసిపి వారికి జెసి కాంట్రాక్ట్ ఎలా అప్పగిస్తారని తిరగబడ్డంతో పల్లె ఆ పనులకు బ్రేక్ వేశారు. విషయం జెసి దివాకరరెడ్డికి చేరడం ఆయన మాజీ మంత్రి పల్లెపై తనదైన శైలిలో అగ్గిమీద గుగ్గిలం అయి ముఖ్యమంత్రి వద్దన్నా చేస్తావా? నువ్వెవరు ఆపడానికి? అంటూ ఫైర్ అయిపోయారు. ఆ సంభాషణను కొందరు వీడియో తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. అది వైరల్ గా మారడంతో ఏం చేయాలో తెలియని పల్లె అనుచరులు రహస్యంగా వీడియో తీసి తమ పరువు బజారులో పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ వారు కావడంతో ఖాకీలు సైతం సీరియస్ గా యాక్షన్ లోకి దిగి ఈ వీడియో తో సంబంధం వున్న నలుగురిపై కేసు నమోదు చేశారు. దాంతో అడ్డగోలుగా ప్రజాధనాన్ని కాంట్రాక్టుల రూపంలో దండుకుంటున్న వ్యవహారాలు వీడియో ల రూపంలో స సాక్ష్యంగా దొరికినా అసలు నేతలపై చర్యలు లేకుండా బండారం బయట పెట్టిన వారిపై కేసులేమిటన్నది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో మరో పెద్ద చర్చకు తెరలేచేలా చేసింది.

మరో వివాదంలో మంత్రి ఆదినారాయణ ...

ఇదిలా ఉంటే సీఎం రమేష్ తో గొడవ సర్దుమణగకుండానే మంత్రి ఆదినారాయణ కార్యకర్తల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా లో రచ్చ రచ్చగా మారాయి. జిల్లాలో ఏ పనులైనా తనకు, విప్ రామసుబ్భారెడ్డి కి సీఎం సమక్షంలోనే ఇవ్వాలన్న హామీ ఉందంటూ వాటాలు పంచుకుంటున్నట్లు మంత్రి చెప్పడంతో రాష్ట్రంలో పాలన కాదు ట్రేడింగ్ అంటూ వస్తున్న విమర్శలు నిజమనే ప్రచారం ఒకవైపు నడుస్తుంటే మరోవైపు ఎన్నికల ఏడాది తమ్ముళ్ళ హల్చల్ అధికారపార్టీకి తీవ్ర తలవంపులు తెచ్చిపెడుతుంది. వీటిపై చంద్రబాబు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్న ఆసక్తి అన్ని వర్గాల్లో నెలకొంది.

Similar News