అనారోగ్యంతో దివికేగిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణం సహజ మరణం కాదా. అవుననే రీతిలోనే అపోలో వర్గాలు ఇప్పుడు బాంబులు పేలుస్తున్నాయి. పురచ్చితలైవి ఆసుపత్రిలో చేరే సమయానికి తీవ్ర జ్వరంతో చేరారని ఇంతకు ముందు ప్రకటించిన ఆసుపత్రి వర్గాలు తాము గతంలో ప్రకటించిన దానికి భిన్నంగా స్పందించాయి. జయ ఆసుపత్రి లో చేరే సమయానికి ఆమెకు శ్వాస ఆడటం చాలా ఇబ్బందిగా ఉందని దాదాపు అపస్మారక స్థితి లోనే చేరారని ఆమె మరణంపై నియమించిన రిటైర్డ్ హై కోర్టు జడ్జి విచారణ లో వెల్లడించారు. తమిళనాడు సర్కార్ నియమించిన ఈ విచారణ సంఘం ముందు అపోలో వైద్యులు చెప్పిన మరికొన్ని అంశాలు నివ్వెరపరిచేలా వున్నాయి. ఆ ఆసుపత్రి మత్తు వైద్యులు జయకు ట్రీట్ మెంట్ సమయంలో మోతాదుకు మించి అధిక స్టెరాయిడ్స్ ఎక్కించినట్లు పేర్కొనడం మరింత సంచలనంగా మారింది. శాంతి భద్రతల సమస్యల రీత్యానే అప్పట్లో ఈ అంశాలు వెల్లడించలేదని అపోలో వర్గాలు పేర్కొనడం గమనార్హం.
75 రోజుల సీరియల్ బయటకు వస్తుందా ...?
తమిళనాడు ముఖ్యమంత్రి హోదాలోనే తీవ్ర అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో జయలలిత చికిత్స కోసం చేరారు. సుమారు 75 రోజుల తరువాత ఆమె తుది శ్వాస విడిచారు. ఆమె ఆసుపత్రిలో చేరిన నాటినుంచి చనిపోయారని ప్రకటించే వరకు అపోలోలో ఏం జరిగింది? ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియనీకుండా జాగర్త పడ్డారు. ఒక దశలో ఆమె కోలుకుందని త్వరలో బాధ్యతలు చేపట్టనున్నట్లు అంతా భావించారు. అపోలో వైద్య వర్గాలు అదే స్థాయిలో డ్రామా రక్తి కట్టించాయి. ఆమె నెచ్చలి శశికళతో పాటు అపోలో వైద్యులకు మాత్రమే అక్కడి విషయాలు తెలుసు. ఆమె మరణం మిస్టరీ అని దాన్ని బయటపెట్టాలని జయ అభిమానుల డిమాండ్లకు అనుగుణంగా తమిళ సర్కార్ విచారణ సంఘాన్ని నియమించిన సంగతి తెలిసిందే. ఆ విచారణలో వెలుగు చూడబోతున్న చేదు నిజాలపై ఇప్పడూ హాట్ టాపిక్ నడుస్తుంది. తమిళనాడులో ఈ చర్చలు సోషల్ మీడియా లో వస్తున్న వార్తలు మరింతగా వైరల్ అవుతున్నాయి.