‘అమ్మ’ ముసుగులో మాయ జరుగుతోందా?

Update: 2016-10-10 07:14 GMT

తమిళనాడు పురట్చి తలైవి జయలలిత సుమారు మూడు వారాలకు పైగా ఆస్పత్రిలోనే ఉంటూ చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతానికి తమిళనాడు అధికార బదలాయింపు గానీ, తాత్కాలిక ముఖ్యమంత్రుల నియామకం వంటి వ్యవహారం గానీ ఏమీ ఉండబోవడం లేదని ఒక అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. నిజానికి నాలుగు రోజుల కిందటే.. కొత్త ముఖ్యమంత్రి ఊహాగానాలు తెరమీదకు వచ్చాయి. గానీ.. అంతలోనే సద్దుమణిగాయి. అయితే ఇప్పుడు కొత్త వివాదం తెరమీదకు వస్తోంది.

జయలలిత సంతకాలతో పాత తేదీలు వేసి నకిలీ పార్టీ పదవుల నియామక పత్రాలు తయారయ్యాయని, వాటి ద్వారా అధికారం చేతులు మారడానికి రంగం సిద్దమవుతున్నదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో అన్నా డీఎంకే నుంచి బహిష్కరణకు గురైన రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప.. గవర్నర్ విద్యాసాగర్ రావుకు ఒక లేఖ రాశారు. అందులో ఆమె సంచలన ఆరోపణలు చేశారు.

జయలలిత సంతకాలతో ఆ పార్టీకి డిప్యూటీ జనరల్ సెక్రటరీని అపాయింట్ చేసినట్లుగా లేఖలు వెలుగులోకి వస్తున్నాయని అందులో నిజానిజాలు నిగ్గు తేల్చాలని శశికళ పుష్ప కోరుతున్నారు. అలాంటి పార్టీ పదవుల్లోకి నియామకం ఇలాంటి నకిలీ సంతకాలతో పూర్తిచేస్తే.. తద్వారా అధికారం దక్కించుకోవడం సులభంగా జరిగిపోతుందేమో అని అనుమానాలు కలిగేలా శశికళ పుష్ప ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వాన్ని నడిపేందుకు ప్రత్యామ్నాయాలు ఏమైనా సూచిస్తూ... జయలలిత సంతకంతో లేఖ ఏమైనా వచ్చినట్లయితే దాన్ని క్షుణ్నంగా పరిశీలించాలంటూ ఆమె గవర్నరుకు ఫిర్యాదు చేశారు.

ఈ లేఖ నేపథ్యంలో తమిళనాట మళ్లీ జనంలో అనుమాన మేఘాలు కమ్ముకుంటున్నాయి. జయలలిత ఆస్పత్రిలోనే ఉంటారని, అక్కడినుంచి పరిపాలన మొత్తం సాగుతుందని, అమ్మ చేతిలో ఉన్న ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు అన్నిటినీ ఇతరులకు బదలాయిస్తున్నారని వార్తలు వచ్చిన గంటల వ్యవదిలోనే ఇలాంటి సంచలన లేఖ రావడం విశేషమే.

Similar News