అమ్మ మరణంపై మిస్టరీ వీడేనా?

Update: 2017-10-27 18:29 GMT

దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై న్యాయవిచారణ ప్రారంభమైంది. జయలలిత అనుమానాస్పదంగా మృతి చెందారని తమిళనాడులో అనేక మంది భావిస్తున్నారు. దాదాపు 75 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన జయలలిత కోలుకుంటున్నారని, త్వరలోనే డిశ్చార్జి అవుతారని ప్రకటించిన ఆసుపత్రి యాజమాన్యం, తర్వాత కొద్దిగంటలకే మరణించినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో అమ్మ మరణంపై అనేక అనుమానాలు తలెత్తాయి. జయలలితను ఆస్పత్రికి తీసుకొచ్చే ముందే పోయెస్ గార్డెన్ లో ఘర్షణ జరిగినట్లు కూడా అన్నాడీఎంకే నేతలు ఆరోపించారు. ఆ ఘర్షణలో జయలలిత కింద పడిపోయారని కూడా చెప్పారు. ఇలాంటి ఆరోపణల నేపథ్యంలో తమిళనాడు సర్కార్ జయలలిత మరణంపై న్యాయవిచారణకు ఆదేశించిన సంగతి తెలసిందే.

ఆసుపత్రికి, శశికళకు నోటీసులు....

అయితే ప్రభుత్వం నియమించిన న్యాయవిచారణకు రిటైర్డ్ జడ్జి ఆర్ముగ స్వామి నేతృత్వం వహిస్తారు. ఆయన ఒక్కడే అమ్మ మరణంపై విచారణ జరుపుతారు. ఈ మేరకు రిటైర్డ్ జడ్జి ఆర్ముగ స్వామి ఈరోజు బాధ్యతలు తీసుకున్నారు. అయితే ఈ కేసుతో సంబంధం ఉన్నవారందరికీ నోటీసులు పంపనున్నారు. తొలుత అపోలో ఆసుపత్రి యాజమాన్యానికి, శశికళ కుటుంబసభ్యులకు ఈ నోటీసులు అందనున్నాయి. శశికళ జైలులో ఉండటంతో ఆమె నుంచి ఎలా సమాధానాలు రాబడతారన్నది ఆసక్తిగా మారింది. మరోవైపు దినకరన్ జయలలితకు చికిత్స జరిగే సమయంలో తీసిన వీడియో మొత్తం తమ వద్ద ఉందని చెప్పారు. దీంతో ఈ వీడియో ఫుటేజీని కూడా ఆర్ముగ స్వామి అడిగే అవకాశాలున్నాయి. మొత్తం మీద అమ్మ మరణంపై నివేదికను మూడు నెలల్లో ఆర్ముగస్వామి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. మూడు నెలల్లో నివేదికను ఇవ్వనున్నట్లు ఆర్ముగ స్వామిఈరోజు బాధ్మతలు స్వీకరించిన అనంతరం చెప్పారు.

Similar News