‘అమ్మ’ చుట్టూనే ఆర్కే నగర్ ఎన్నిక...!

Update: 2017-12-02 17:30 GMT

ఇద్దరూ జయ బొమ్మతోనే బరిలోకి దిగుతున్నారు. ఆర్కేనగర్ మొత్తం ‘అమ్మ’ నామస్మరణతోనే మారుమోగిపోతోంది. పార్టీ అధికారిక గుర్తు రెండాకులను అన్నాడీఎంకే పళనిస్వామి వర్గం పొందినప్పటికీ దినకరన్ జయలలితను వదలడం లేదు. ఎంజీఆర్, జయలలిత బొమ్మలతో ప్రత్యేక జెండాలను రూపొందించారు. తన ప్రచారంలో జయలలితనే ప్రధానంగా దినరన్ తీసుకెళుతున్నారు. ఆర్కేనగర్ ఉప ఎన్నిక ఈ నెల 21వ తేదీన జరగుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రధానంగా పోటీలో ఉన్న అన్నాడీఎంకే అభ్యర్థి మధుసూదనన్, డీఎంకే అభ్యర్ధి మరుదు గణేశ్, శశికళ వర్గం అభ్యర్థి దినకరన్ లు నామినేషన్లు వేశారు. మధుసూదనన్ అధికారికంగా రెండాకుల గుర్తు, అన్నాడీఎంకే జెండాతో ర్యాలీగా వచ్చారు. నామినేషన్ కు ముందు ఎంజీఆర్, జయలలిత సమాధి వద్ద నివాళులర్పించారు.

అమ్మ బొమ్మతోనే....

ఇక దినకరన్ కూడా జయలలిత, ఎంజీఆర్ సమాధులకు నామినేషన్ కు ముందు నివాళులర్పించారు. దినకరన్ అచ్చం అన్నాడీఎంకే పార్టీ జెండా రంగుతోనే కొత్త జెండాను తయారు చేయించి అందులో ఎంజీఆర్, జయలలిత ఫొటోలను ముద్రించారు. ఆర్కే నగర్ ఉప ఎన్నిక జయలలిత మరణంతో జరగనుండటంతో జయలలిత బొమ్మతోనే దినకరన్ ను కూడా బరిలోకి దిగుతున్నారు. దినకరన్ వెంట భారీ సంఖ్యలో అభిమానులు, అనుచరులు తరలి వచ్చారు. అయితే దినకరన్ ఉపయోగిస్తున్న జెండాపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని పళనిస్వామి వర్గం చెబుతోంది. ఎన్నికల కమిషన్ తీర్పునకు విరుద్ధంగా ఓటర్లను తప్పుదోవ పట్టించేందుకే జెండా రంగును వాడుకుంటున్నారని వారు ఆరోపిస్తున్నారు. దినకరన్, పళనిస్వామిలకు ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకం కావడంతో అమ్మ ను ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత వర్ధంతి త్వరలోనే జరగనుంది. ఈ వర్ధంతి సభను కూడా ఆర్కే నగర్ లో జరిపేందుకు రెండు వర్గాలూ ప్లాన్ చేసుకున్నాయి. మొత్తం మీద ఆర్కే నగర్ ఉప ఎన్నిక అమ్మ చుట్టూనే తిరుగుతుండటం విశేషం.

Similar News