‘అమ్మ’ చచ్చిపోలేదా? చంపేశారా?

Update: 2016-12-09 20:51 GMT

అమ్మ పురట్చి తలైవి కన్నమూసి నాలుగురోజులు అవుతోంది. అసలైన అమ్మ భక్తుల కనుల తడి ఇంకా ఆరనే లేదు. అప్పుడే జయలలిత మరణానికి సంబంధించి.. తమిళనాడును కుదిపేసే స్థాయిలో చాలా పెద్ద పెద్ద ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అసలు అమ్మ జయలలిత ది సహజ మరణం కానే కాదని, ఆమెను చంపేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏదో గాలికి పుట్టే పుకార్ల మాదిరిగా కాకుండా, గౌతమి లాంటి సీనియర్ నటి అమ్మ జయలలిత హత్యకు గురయ్యారనే అనుమానాలు వ్యక్తం చేస్తూ దీనిపై పూర్తిస్థాయిలో న్యాయవిచారణ జరిపించాలంటూ ప్రధాని మోదీకి లేఖ రాయడం మాత్రం చిన్న అంశం కాదు. జయలలిత ఆరోగ్యం విషయంలో గత కొన్ని నెలలుగా నెలకొన్న పరిణామాలు ఎన్నో సమాధానం దొరకని ప్రశ్నలను రేకెత్తిస్తున్నాయని గౌతమి మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.

జయలలితను ఎంతగానో అభిమానించే గౌతమి ఏకంగా ప్రధాని మోదీకి లేఖ రాయడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. జయలలిత మరణం సహజమరణం కాదనే అనుమానాలు సర్వత్రా రేకెత్తుతున్నాయి.

గౌతమి వంటి సీనియర్ ఇలాంటి ఆరోపణలు చేయడంతో.. ఎంతో కాలంగా జయలలిత ఆరోగ్యం గురించి, ఆమెకు చికిత్స జరుగుతున్న వైనం గురించి, వాటి విషయంలో రహస్యాన్ని పాటించిన తీరు గురించి ఉన్న అనుమానాలు అన్నీ మళ్లీ తెరమీదకు వస్తున్నాయి. జయలలిత నెచ్చెలిగా పేరున్న శశికళను వేలెత్తి చూపే ఆరోపణలు కూడా అనేకం వస్తుండడం విశేషం.

జయలలితకు స్లోపాయిజనింగ్ జరిగిందని, ఒక పథకం ప్రకారం ఆమె మరణానికి కారణమయ్యారనే పుకార్లకు తక్కువ లేదు. అయితే వీటిలో న్యాయవిచారణ జరిపించాలనే డిమాండ్ మాత్రం తీవ్రతను సంతరించుకుంటోంది. జయలలితను అమ్మగా ఆరాధించిన తమిళ ప్రపంచం.. ఇలాంటి వదంతులను విని నిర్ఘాంత పోతోంది. ఒకవేళ జయలలితది సహజమరణం కాదనే సంగతి నిర్ధరణ అయితే, ఆమె మరణం ఒక కుట్ర పర్యవసానం అని తేలితే, దానికి బాధ్యులెవరో నిగ్గు తేలితే.. అమ్మభక్తుల స్పందన ఎలా ఉంటుందో చెప్పడం కష్టం అని కూడా పలువురు అంటున్నారు.

Similar News