అమ్మ ఆరోగ్యంపై పిటిషన్‌ దారుకు హైకోర్టు అక్షింతలు!

Update: 2016-10-06 05:33 GMT

జయలలిత ఆరోగ్యపరిస్థితి ఎలా ఉంది? తాజా సమాచారం ఏమిటి? ఆమెకు చికిత్స పూర్తి కావడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుంది? రాష్ట్ర ప్రజల ఆందోళనల నేపథ్యంలో ఇలాంటి వివరాలు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాల్సిందేనంటూ ఓ వ్యక్తి మదరాసు హైకోర్టులో దాఖలు చేసిన కేసును న్యాయస్థానం గురువారం కొట్టేసింది. ఒక వ్యక్తికి చికిత్స అందించడానికి ఎన్ని రోజులు పడుతుందో ఎవరూ చెప్పలేరంటూ తీవ్రంగా వ్యాఖ్యానించింది. అంతే కాకుండా.. ఇలాంటి ప్రత్యేక పరిస్థితులను రాజకీయాలకు వాడుకోవద్దంటూ పిటిషనర్‌కు అక్షింతలు వేసింది.

జయలలిత అనారోగ్యంతో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆమె కు సీరియస్‌ అయినప్పటినుంచి , ప్రతిపక్ష నేత కరుణానిధి, ఆమె వీడియోలు చూపించాలని, ఫోటోలు చూపించాలని, తాజా సంగతి ఆస్పత్రి వర్గాలు చెప్పాలని డిమాండ్‌ చేస్తూనే ఉన్నారు. విపక్ష నేత గనుక.. ఆయన మాటలను ఎవ్వరూ పట్టించుకోలేదు.

ఈలోగా ఓ ప్రెవేటు వ్యక్తి రామస్వామి హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై వివరాలు చెప్పడం గురించి హైకోర్టు అపోలోను ఆదేశించింది. వారు బుధవారం సాయంత్రం హైకోర్టుకు లేఖ ద్వారా ఆరోగ్య పరిస్థితి వివరించారు. దానిపై గురువారం విచారించిన హైకోర్టు రెండు నిమిషాల్లోనే వాదనలను, విచారణను ముగించింది. ఇది పబ్లిక్‌ ఇంటరెస్ట్‌ పిటిషన్‌ లా లేదని, పబ్లిసిటీ ఇంటరెస్ట్‌ పిటిషన్‌లా ఉన్నదని హైకోర్టు అక్షింతలు వేసింది. ఇలాంటివి రాజకీయాలకు వాడుకోవద్దని హితవు చెప్పింది. ఇండైరక్టుగా డీఎంకే వాదనకు కూడా హైకోర్టు అక్షింతలు వేసినట్లయింది.

Similar News