ఎన్నికలొస్తే చాలు ఏదో ఒక వివాదం తమిళనాడును చుట్టుముడుతోంది. ఇప్పుడు ఆర్కే నగర్ ఉప ఎన్నిక షెడ్యూలు విడుదలయింది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత కుమార్తెను తానేంటూ బెంగళూరుకుచెందిన అమృత ముందుకొచ్చింది. తాను జయలలితకే జన్మించానని, కావాలంటే డీఎన్ఏ టెస్ట్ చేసుకోవచ్చని ఆమె సుప్రీం కోర్టు గడప కూడా తొక్కారు. అయితే సుప్రీం కోర్టు మాత్రం అమృత పిటిషన్ ను తిరస్కరించింది. ఈ విషయాన్ని మద్రాస్ హైకోర్టులోనే తేల్చుకోవాలని చెప్పింది. దీంతో అమృత మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేయనున్నారు. జయలలిత జీవించి ఉన్నంత వరకూ ఎవరూ ముందుకు రాలేదు. అయితే జయ మరణం తర్వాత వరుసగా వారసులం మేమంటూ కొందరు ముందుకు వస్తున్నారు. గతంలో తాను జయలలిత కుమారుడినంటూ ఫేక్ డాక్యుమెంట్లు, ఫొటోలను సృష్టించిన ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అమృత విషయంలో మాత్రం కొంత నిజముందంటున్నారు అన్నాడీఎంకే నేతలు. వారే కాదు స్వయంగా జయలలిత అత్తకూతురు లలిత జయలలితకు ఆడబిడ్డ పుట్టిందన్న విషయాన్ని అంగీకరిస్తున్నారు.
జయ అత్తకూతురు కూడా అంగీకారం...
జయలలితకు 1980 ఆగస్టు 14వ తేదీన బెంగుళూరులో తాను జన్మించినట్లు అమృత స్పష్టంగా చెబుతున్నారు. కావాలంటే డీఎన్ఏ పరీక్షలకు కూడా సిద్ధమని ప్రకటించారు. తాను రెండు మూడు సార్లు జయలలితను కలుసుకున్నానని కూడా అమృత చెబుతున్నారు. తాను జయ కూతురినన్న విషయం ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వానికి కూడా తెలుసునన్నారు. అయితే దీనిపై పన్నీర్ సెల్వం మాత్రం పెదవి విప్పడం లేదు. జయలలిత అత్తకూతురు లలిత మాత్రం స్పష్టంగా జయలలితకు ఆడబిడ్డ పుట్టిందని చెబుతున్నారు. అయితే ఆ ఆడబిడ్డ అమృత అవునా? కాదా? అన్న విషయం తనకు తెలియదంటున్నారు. తనను పుట్టినప్పుడే శైలజకు దత్తత ఇచ్చారంటున్నారు అమృత అయితే తనను పెంచిన తల్లిదండ్రులు చనిపోవడంతోనే తాను జయలలిత కూతురినన్న విషయం తెలిసిందని చెబుతున్నారు. మొత్తం మీద జయ మరణించి దాదాపు ఏడాది కావస్తున్నా ఆమె వారసత్వంపై మాత్రం ఇంకా వివాదం నలుగుతూనే ఉంది. మద్రాస్ హైకోర్టు దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.