అమిత్ షా ఏం చేయనున్నారు?

Update: 2018-03-07 22:30 GMT

ఏపీలో జరగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీలో అమిత్ షా పార్టీ నేతలతో భేటీ కానున్నారు. దేశరాజధానికి రావాలంటూ అమిత్ షా నుంచి సమాచారం అందింది. దీంతో ఏపీ బీజేపీ నేతలు నేడు సమావేశమయ్యేందుకు ఢిల్లీ వెళుతున్నారు. ఢిల్లీలో అమిత్ షా ఏపీలో బీజేపీ అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పేయడం, టీడీపీ ఆందోళనకు దిగుతుండటం, పొత్తు నుంచి బయటకు వెళ్లిపోవాలని టీడీపీ భావిస్తుండటంతో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.

నేడు సమావేశం....

అయితే టీడీపీ పొత్తునుంచి బయటకు వెళితే ఏం చేయాలన్న దానిపై కూడా సమావేశంలో చర్చించనున్నారు. పొత్తు నుంచి విడిపోతున్నట్లు ప్రకటన టీడీపీ చేసిన వెంటనే ఏపీలో కొనసాగుతున్న మంత్రుల చేత రాజీనామా చేయించాలని బీజేపీ అధిష్టానం ఇప్పటికే నిర్ణయించింది. టీడీపీ పొత్తు తెగదెంపులు చేసుకోక ముందే పార్టీని బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై కూడా అమిత్ షా నేతలతో మాట్లాడనున్నారు. ఏపీ సర్కార్ చేస్తున్న డిమాండ్లు నెరవేర్చడం సాధ్యం కాదని కూడా అమిత్ షా వారితో చెప్పనున్నారు.

ప్రత్యామ్నాయం ఏదీ?

టీడీపీ పొత్తు నుంచి విడిపోతే ప్రత్యామ్నాయం ఏమిటన్నది కూడా అమిత్ షా వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకోనున్నారు. నిన్న అసెంబ్లీ లాబీల్లోనే ఏపీ సర్కార్ లో ఉన్న బీజేపీ మంత్రులు రాజీనామాలు చేస్తారన్న ప్రచారం జరిగింది. మంత్రి కామినేని శ్రీనివాస్ కు అధిష్టానం నుంచి ఫోన్ వచ్చిందని రాజీనామాలకు సిద్ధంగా ఉండాలని చెప్పినట్లు కూడా వార్తలొచ్చాయి. అయితే చంద్రబాబు అసెంబ్లీలో పొత్తుపై ఎలాంటి ప్రకటన చేయలేదు. కేవలం మూడు రోజుల్లో విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

మూడు రోజులకు ముందే....

మూడు రోజుల్లోగా విభజన హామీలు అమలు చేయకుంటే చంద్రబాబు నిర్ణయం తీసుకునే అవకాశముందని గ్రహించిన బీజేపీ అధిష్టానం ఢిల్లీకి రావాలని బీజేపీ నేతలను ఆహ్వానించింది. ఈ మేరకు బీజేపీ నేతలు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. మొత్తం మీద ఏపీలో రాజకీయాలు హీటెక్కినట్లే కన్పిస్తున్నాయి. మూడు రోజుల్లో సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.

Similar News