ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న వాదన సరికాదని, రాజకీయ కారణాలతోనే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ నుంచి వైదొలిగిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అభిప్రాయపడ్డారు. ఈ మేరకు అమిత్ షా టీడీపీ అధినేత చంద్రబాబుకు 9 పేజీల లేఖ రాశారు. ఈ లేఖలో చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాన్ని అమిత్ షా ఎత్తిచూపారు. కేవలం రాజకీయ కారణాల వల్లనే మీరు మా నుంచి దూరమయినట్లు అనిపిస్తుందన్నారు. ఏకపక్షంగా టీడీపీయే ఎన్డీఏ నుంచి బయటకు వెళ్లిందన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు. తాము కాంగ్రెస్ లా కాదని, ఏపీ ప్రజల కష్టసుఖాలకు బీజేపీ ఎప్పుడూ తోడుగా ఉంటుందని పేర్కొన్నారు.
ఏపీకి న్యాయం చేస్తూనే ఉన్నా....
విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ చాలా నష్టపోయినట్లు బీజేపీ గుర్తించిందన్నారు. సెంట్రల్ యూనివర్సిటీ, గిరిజన యూనివర్సిటీకి ఈ బడ్జెట్ లో నిధులను కేటాయించిన విషయాన్ని ఆయన లేఖలో గుర్తు చేశారు. మొత్తం ఎనిమిది ప్రాజెక్టుల్లో ఐదు ప్రాజెక్టుల్లో పనులు ప్రారంభమయ్యాయన్నారు. 24 వేల కోట్ల రూపాయల నిధులతో అమరావతి నుంచి అనంతపురం వరకూ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ వే నిర్మాణానికి సిద్ధంగా ఉన్నామని, అయితే రాష్ట్ర ప్రభుత్వమే ఇందుకోసం భూమిని కేటాయించాల్సి ఉందని ఆయన గుర్తు చేశారు. 180 కిలోమీటర్ల మేరకు అమరావతికి చుట్టూ రింగ్ రోడ్ నిర్మాణానికి తాము రెడీ గా ఉన్నామని, ఇందుకోసం 19,700 కోట్లు ఖర్చవుతుందని చెప్పారు.
లెక్కలు చెప్పకుండానే....
విజయవాడ-గుంటూరు వయా అమరావతి కొత్త రైల్వే లైను వ్యయం 2680 కోట్లు ఖర్చవుతుందన్నారు. 2014 రాష్ట్ర పునర్విభజన చట్టం లో పేర్కొన్న ప్రకారం నాలుగేళ్లలో అనేక నిధులు ఇచ్చామన్నారు. ఏపీ సమస్యల పట్ల బీజేపీ ఉదాసీనంగా వ్యవహరిస్తుందనడం అర్థం లేని వాదనగా అమిత్ షా కొట్టిపారేశారు. టీం ఇండియా స్పిరిట్ తోనే ప్రధాని మోడీ పనిచేస్తున్నారన్నారు. 11 జాతీయ విద్యాసంస్థలను 2022 లోగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ట్రిపుల్ ఐటీ, ఐఐటీ, నిట్, ఐఐఎం, ఐఐపీఈ, అగ్రి యూనివర్సిటీ, ఎయిమ్స్ హాస్పిటల్స్ కూడా పూర్తి చేస్తామని చెప్పారు. రాజధాని నిర్మాణం కోసం 1000 కోట్ల రూపాయలు నిధులు ఇస్తే అందులో 12 శాతం మాత్రమే ఖర్చు పెట్టారని, లెక్కలు చెప్పలేదని కూడా అమిత్ షా తన లేఖలో పేర్కొన్నారు. గత వారం రోజులుగా టీడీపీ కేంద్రంపై చేస్తున్న ఆరోపణలకు అమిత్ షా గట్టిగా బదులిచ్చారు. కేంద్రం ఇచ్చిన నిధులను సద్వినియోగం చేసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలంటూ అమిత్ షా తన లేఖను ప్రారంభించడం విశేషం.