అమరావతిలోనే రేవంత్ భవితవ్యం?

Update: 2017-10-28 03:30 GMT

టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్ర‌బాబు.. తెలంగాణ టీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న రేవంత్ రెడ్డిపై ఈరోజు నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే విజయవాడకు తెలంగాణ టీడీపీ నేతలు చేరుకున్నారు. వారితో చర్చించిన తర్వాత రేవంత్ పై చర్యలు తీసుకునే అవకాశముంది. మొన్న‌టి వ‌ర‌కు తీవ్ర స్థాయిలో ఏపీ టీడీపీ నేత‌ల‌పై విమ‌ర్శ‌లు గుప్పించిన రేవంత్ త‌న విమ‌ర్శ‌ల‌పై పార్టీ అధినేత‌కు వివ‌ర‌ణ ఇచ్చేందుకు నిన్న ఉద‌యం బాబు పిలుపు నేప‌థ్యంలో.. హైద‌రాబాద్‌లోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్ కు వచ్చాడు. ఈ సమావేశానికి వచ్చీ రాగానే, చంద్రబాబుకు నమస్కరించిన రేవంత్, "మీతో కొద్దిసేపు విడిగా మాట్లాడాలి" అని కోరాడు. అయితే, ఈ విష‌యంలోనే రేవంత్‌కు గ‌ట్టి షాక్ త‌గిలింది.అటువంటి అవసరం లేదని చంద్రబాబు తేల్చి చెప్పినట్టు సమాచారం.

నిన్న తేలకున్నా....

తాను విడిగా ఎవరితోనూ సమావేశాలు అయ్యేది లేదని చంద్రబాబు స్పష్టం చేయడంతో ఇక చేసేదేమీ లేక, మిగతావారితో పాటే రేవంత్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగానే రేవంత్ ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీని కలిశారా? కలిస్తే ఎందుకు కలిశారు? ఆంధ్రప్రదేశ్ కు చెందిన తెలుగుదేశం నేతలపై తీవ్ర విమర్శలు ఎందుకు చేయాల్సి వచ్చింది? అంటూ టీడీపీ నేతలు చంద్రబాబు ముందే రేవంత్ పై ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో అలా వ్యాఖ్యనిస్తున్న మోత్కుపల్లి, అరవింద కుమార్ గౌడ్ లపై కూడా చంద్రబాబు మండిపడ్డారు. రేవంత్ పార్టీ మారేందుకే నిర్ణయించుకున్నారని రమణ వ్యాఖ్యానించడంతో, ఓ సారి చెప్పి చూద్దామని అన్న చంద్రబాబు, శనివారం అమరావతిలో ఓ నిర్ణయం తీసుకుందామని చెప్పినట్టు స‌మాచారం. మ‌రోప‌క్క‌, బాబు పొమ్మ‌న‌కుండా.. తానే పార్టీని వీడాల‌ని రేవంత్ డిసైడ్ అయ్యాడ‌ని స‌మాచారం.

అమరావతికి టీటీడీపీ నేతలు....

ఇక‌, రేవంత్ వ్య‌వ‌హారం గ‌త ప‌దిహేను రోజులుగా మీడియాలో ప్ర‌ముఖంగా క‌నిపిస్తోంది. ఆయ‌న ఏపీ టీడీపీ నేత‌ల‌ను చ‌డా మ‌డా తిట్ట‌డంతోపాటు.. మంత్రులు యనమల, పరిటాలపై కూడా తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ఇక‌, య‌న‌మ‌ల‌, ప‌య్యావుల కేశ‌వ్ వంటి వారు కేసీఆర్‌తో అంట‌కాగుతూ.. తెలంగాణ‌లో కేసీఆర్‌పై ఫైట్ చేస్తున్న టీడీపీ నేత‌ల‌ను ఫూల్స్‌ను చేస్తున్నార‌ని విరుచుకుప‌డ్డారు. మొత్తానికి ఈ ప‌రిణామం అటు తెలంగాణ‌, ఇటు ఏపీ టీడీపీలో తీవ్ర చ‌ర్చ‌కు దారితీసింది. అయితే, టీడీపీలో త‌న‌కు త‌గిన గుర్తింపు ల‌భించ‌డం లేద‌ని, దీనికితోడు ఓటుకు నోటు కేసులో త‌న‌ను జైలుకు పంపిన కేసీఆర్‌తో పోత్తుకు టీడీపీ త‌హ‌త‌హ లాడుతోంద‌ని రేవంత్ భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే తాను పార్టీ మారాల‌ని డిసైడ్ అయిన‌ట్టు తెలుస్తోంది. ఏదేమైనా మరికాసేపట్లో రేవంత్ రాజ‌కీయ విన్యాసం స‌రికొత్త మ‌లుపు తిరగ‌డం ఖాయం అంటున్నారు విశ్లేష‌కులు. ఇప్పటికే అమరావతి చేరుకున్న టీటీడీపీ నేతలు మరికాసేపట్లో ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో చంద్రబాబుతో భేటీ కానున్నారు. ఈ భేటీ అనంతరం రేవంత్ పై నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.

Similar News