అమరావతిలో పవన్ జెండా పాతేస్తున్నారు ....!

Update: 2017-11-24 07:30 GMT

ఇంతకాలం సోషల్ మీడియాకే పరిమితం అయిన జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దూకుడు పెంచుతున్నారు. తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెడుతూ గుంటూరు జిల్లా చినకాకానిలో ఎకరంన్నర స్థలం లీజుకు తీసుకుని జనసేన ఏపీ ప్రధాన కార్యాలయ స్థాపనకు రంగం సిద్ధం చేశారు పవర్ స్టార్. ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమా అజ్ఞాతవాసి జనవరిలో రిలీజ్ పూర్తి అయ్యాక ఒక నెల గ్యాప్ తీసుకుని పొలిటికల్ స్క్రీన్ పై బిజీ అవ్వాలని పవన్ భావిస్తున్నారట. ఈలోగా అమరావతికి దగ్గరగా ఉన్న చిన కాకానిలో లీజుకు తీసుకున్న స్థలంలో పార్టీ కార్యాలయం నిర్మాణం పూర్తి చేయాలని జనసేనాని ఆదేశించినట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి.

ఫిబ్రవరిలో అజ్ఞాతం వీడతారా ...?

అజ్ఞాత వాసి చిత్రం విడుదల పూర్తి అయ్యాక ఫుల్ టైం పాలిటిక్స్ కి పీకే శ్రీకారం చుడతారట. తొలిగా పార్టీ ప్లీనరీ ఆ తరువాత బస్సు యాత్రకు ప్లాన్ చేస్తున్నారు పవన్. సినిమాలు రాజకీయాలను సమపాళ్లలో బాధ్యతగా తీసుకుని రాబోయే కాలంలో పార్టీ నిర్మాణం పూర్తి చేయాలన్నది లక్ష్యంగా జనసేన సాగిపోతుంది.

మూడేళ్ళ తరువాత ...?

అమరావతిలో జనసేన కార్యాలయం కోసం తీసుకున్న స్థలం కాలపరిధి మూడేళ్ళు. లీజు కోసం ఎకరానికి 50 వేల రూపాయలు చెల్లిస్తున్నారు. దాంతో వచ్చే ఎన్నికల్లో ఎసి డిసి అయితే కార్యాలయం ఎత్తేస్తారా అని నెటిజెన్లు ప్రశ్నలు వేస్తున్నారు సోషల్ మీడియా లో . మరోపక్క పార్ట్ టైం పాలిటిక్స్ చేసుకుంటున్నారన్న విమర్శలు జనసేనానిపై వెల్లువెత్తుతున్నాయి. కీలకమైన పోలవరం వంటి వాటిమీద పవన్ దృష్టి సారించాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. సినిమా తరహాలోనే పార్టీ నిర్మాణం చేస్తే ఎంతోకాలం మనుగడ సాగించలేరని నెటిజెన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

స్పీడ్ పెంచనున్న జనసేన ...

లండన్ లో అవార్డు స్వీకరించి వచ్చాక పీకే పార్టీ కార్యక్రమాల కార్యాచరణలో తలమునకలయ్యారు. ఇక స్పీడ్ పెంచి జనంలోకి జనసేనను తీసుకువెళ్లాలని పవన్ భావిస్తున్నారు. అదీ కూడా వచ్చే ఫిబ్రవరి లో పవన్ తన కార్యాచరణ మొదలపెట్టనున్నారు. దాంతో జనసైనికుల్లో ఉత్సహం మొదలైంది.

Similar News