ప్రజారాజధాని అమరావతి నగర నిర్మాణానికి ప్రధానంగా 5 మార్గాలలో నిధుల సమీకరణ చేపట్టనున్నారు. ప్రపంచస్థాయి నగరంగా రూపుదాల్చనున్న కొత్త రాజధానికి నిర్మాణదశలో ఎలాంటి నిధుల కొరత రానివ్వరాదన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచనల మేరకు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ నిధుల సమీకరణకు గల అవకాశాలపై కసరత్తు చేసి కొన్ని ప్రతిపాదనలను సిద్ధం చేసింది. బుధవారం జరిగిన సమీక్షా సమావేశంలో ఈ ప్రతిపాదనలను రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) కమిషనర్ చెరుకూరి శ్రీధర్ ముఖ్యమంత్రి ముందుంచారు. దీనిపై సమావేశంలో సవివరంగా చర్చించారు.
రాజధాని నిర్మాణానికి తాజా అంచనాల ప్రకారం రూ.58 వేల కోట్లు ఖర్చు కాగలదని భావిస్తున్నారు. ఈ మొత్తంలో 70 శాతం అంటే రూ.32 వేల కోట్లు రానున్న 2017, 18, 19 సంవత్సరాలలో మౌలిక సదుపాయాల కల్పనకు ఖర్చవుతుందని అంచనావేశారు. ఈ నిధులను హడ్కో, వరల్డ్ బ్యాంక్, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర మార్గాల ద్వారా సమకూర్చుకోవాలని నిర్ణయించారు. రాజధానిలో ఆవాస సముదాయాల నిర్మాణాలకు హడ్కో ఆర్థిక సహాయం అందిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు, ఇతరులకు గృహ సముదాయ నిర్మాణాల నిమిత్తం రాజధాని అభివృద్ధి ప్రాధికార సంస్థ అమరావతిలో కొంత స్థలాన్ని కేటాయించనుంది. రాజధాని నిర్మాణానికి ఆర్థిక సహకారం అందించే సంస్థల ప్రతినిధులతో ఈనెల 25న ‘అమరావతి ఫైనాన్సింగ్ రౌండ్ టేబుల్’ పేరుతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తున్నారు.
సీఆర్‌డీఏ 5 ప్రతిపాదనలలో మొదటిది పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ విధానం. దీని ద్వారా రాజధానిలో రహదారులు (రోడ్ ప్యాకేజ్ 2, 3), నీరు, విద్యుత్ పంపిణీ వ్యవస్థ ఏర్పాటు వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. ఈ పీపీపీ పద్ధతిలో చేపట్టే ప్రాజెక్టుల ఆమోదానికి, పర్యవేక్షణకు ఒక సాధికార కమిటీని ఏర్పాటుచేస్తారు. పీపీపీ పద్ధతిలో రూ. 5,500 కోట్లు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటుకు సమకూరగలవని భావిస్తున్నారు.
రెండో ప్రతిపాదన ప్రకారం లీజు-రెంటల్ డిస్కౌంటింగ్ విధానంలో ప్రభుత్వ భవనాలు, ప్రభుత్వ నివాసాలు, సీడ్ కేపిటల్ ఏరియా అభివృద్ధి చేపడతారు. ఈ విధానంలో సీఆర్‌డీఏకు ప్రభుత్వ శాఖల నుంచి అద్దెలు, ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ఇంటి అద్దె భృతి (హెచ్‌ఆర్ఏ) ద్వారా నిధులు సమకూరుతాయి. లీజ్ రెంటల్ డిస్కౌంటింగ్ విధానంలో మొత్తం రూ.2850 కోట్లు సీఆర్‌డీఏకు సమకూరగలవని అధికారులు అంచనావేశారు.
ఇక మూడో ప్రతిపాదన ప్రకారం జీ2జీ ఈక్విటీ ఫండ్ ఏర్పాటుచేస్తారు. రాజధాని నిర్మాణంలో పాలుపంచుకోవడానికి ఆసక్తి చూపుతున్న వివిధ దేశాలను భాగస్వాములను చేసి మిశ్రమ ప్రాయోజక అభివృద్ధి (మిక్స్‌డ్ యూజ్ డెవలప్‌మెంట్), సాంఘిక మౌలిక సదుపాయాలను కల్పిస్తారు. రూ.1400 కోట్ల నిధులను జీ2జీ విధానం ద్వారా సమకూరగలవని అధికారులు అంచనాతో వున్నారు.
నాలుగవ ప్రతిపాదన సమష్టి పెట్టుబడుల పథకం (కలెక్టీవ్ ఇన్వెస్టుమెంట్ స్కీమ్). మూడేళ్ల నుంచి పదేళ్ల వ్యవధి గల ల్యాండ్ మానిటైజేషన్ పథకం ఇది. దీని ప్రకారం స్పెషల్ పర్సస్ వెహికిల్ కింద సీఆర్‌డీఏ రాజధానిలో కొంత మేర భూమిని రిజర్వ్ చేసి వుంచుతుంది. వీటిని యూనిట్లుగా విభజించి ఆసక్తిగల పెట్టుబడిదారులను ఆహ్వానిస్తుంది. దీనిపై పెట్టే పెట్టుబడులకు గ్యారంటీ రాబడిని చూపిస్తుంది. భూమి విలువ పెరిగిన సమయంలో ఆ యూనిట్లను విక్రయించడం ద్వారా ఆ లాభాలను పెట్టుబడిదారులకు అందిస్తుంది. రూ.2500 కోట్లు ఈ విధానం ద్వారా సమకూర్చవచ్చునని అధికారులు భావిస్తున్నారు.
ఇక, ఆఖరి ప్రతిపాదన ప్రకారం బాండ్స్ జారీ చేయడం ద్వారా నిధులను సమీకరిస్తారు. ఈ బాండ్లు తీసుకునే వారికి పన్ను మినహాయింపు వంటి ప్రయోజనాలు కల్పిస్తారు. బాండ్ల జారీకి అవసరమైన సెబీ రెగ్యులేటరీ నిబంధనలకు సంబంధించిన ప్రక్రియను పూర్తిచేయాల్సివుంటుంది. ఈ ప్రతిపాదన ప్రకారం రూ.2వేల కోట్లు నిధులు సమకూరగలవని అధికారులు అంచనావేశారు.
జీ2జీ ఈక్విటీ ఫండ్ ఏర్పాటుకు సంబంధించి ఇన్వెస్టుమెంట్ అడ్వయిజర్‌ను ఎంపిక చేయాల్సివుంటుంది. అలాగే, న్యాయ సంబంధిత ప్రక్రియను పూర్తిచేయాల్సివుంది. పన్ను విధానాన్ని రూపొందించాల్సివుంది. కలెక్టీవ్ ఇన్వెస్టుమెంట్ స్కీమ్ కోసం ఇన్వెస్టుమెంట్ బ్యాంకర్‌ను నియమించాల్సివుంటుంది. బాండ్స్ జీరీకి ఆర్థిక శాఖ అనుమతులు, మంత్రిమండలిలో చర్చ తదితర ప్రక్రియను పూర్తిచేయాల్సివుంది.
రాజధానిలో కట్టడాల నిర్మాణంలో ఉపయోగించే ఇసుక, సిమెంట్, మొరం, మెటల్ తదితర సామాగ్రిని ఎంత అవసరమో ముందుగానే గుర్తించి అందుకు తగినట్టుగా వ్యూహ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రి సీఆర్‌డీఏ అధికారులకు సూచించారు. ముఖ్యంగా రాజధాని పరిధిలో ఇసుక తవ్వకాలు నిలిపివేయాలని పదిరోజుల క్రితమే ఆదేశాలు ఇచ్చినా ఇంకా కొన్నిచోట్ల ఆ ప్రక్రియ కొనసాగుతుండటం పట్ల ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తంచేశారు. రాజధాని ప్రాంత పరిధిలోని క్వారీ తవ్వకాలను తక్షణం నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మైనింగ్ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని సీఆర్‌డీఏ యంత్రాంగానికి సహకరించాలని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కూడా ఈ తరహా ముందు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇప్పుడా నిర్మాణం ఇబ్బందులు లేకుండా సాగుతోందని గుర్తుచేశారు. రాజధాని నిర్మాణంలో భాగస్వాములుగా వున్న 8 సలహా సంప్రదింపుల సంస్థలను, ఇతర సంస్థల ప్రతినిధులను సమన్వయం చేసుకుని ముందుకు సాగాల్సిన బాధ్యత రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థదేనని అన్నారు.
నాణ్యత, ధరల నిర్ణయమే రాజధాని నిర్మాణ ప్రక్రియలో జరపవలసిన అతిపెద్ద కసరత్తు అని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో నిధుల విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన అవసరం వున్నదని అన్నారు. దీనికి అనుసరించాల్సిన వ్యూహ ప్రణాళికపై మెకన్జీ వంటి సంప్రదింపుల సంస్థలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.