అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి.. స్విస్ ఛాలెంజ్ కాంట్రాక్టులను ఈ నెలాఖరు నాటికి తుదిరూపు ఇవ్వాలను చంద్రబాబునాయుడు ప్రభుత్వం భావించింది గానీ.. దానికి అన్నీ బాలారిష్టాలే ఎదురవుతున్నట్లుంది. దఫదఫాలుగా స్విస్ ఛాలెంజ్ కు సంబంధించిన పిటిషన్లను విచారించిన హైకోర్టు తాజాగా గురువారం నాడు.. ఈ పిటిషన్ విచారణను అక్టోబరు 13 నాటికి వాయిదా వేసింది. అప్పటిదాకా స్విస్ ఛాలెంజ్ టెండర్ల ప్రక్రియ మొత్తం ఆగినట్లే లెక్క.
స్విస్ ఛాలెంజ్ లో వాటాల విషయంలో ప్రభుత్వం సీక్రెసీ పాటించడం పై తొలుత పిటిషన్ దాఖలైంది. కోర్టు అక్షింతలు వేసిన తర్వాత.. చంద్రబాబు సర్కారు తప్పు దిద్దుకుని రెండు దశలుగా టెండర్లు వేసేలా.. ప్రక్రియలో ఓ డొంక తిరుగుడు సవరణ చేశారు.
అయితే విచారణ సందర్భంగా.. అసలు స్విస్ ఛాలెంజ్ ఎందుకు, ఓపెన్ టెండర్లు మేలు కదా.. అంటూ న్యాయస్థానమే విస్తుపోయినట్లు కూడా వార్తలు వచ్చాయి. ప్రభుత్వం మాత్రం వెనక్కు తగ్గకుండా రకరకాల వివరణలు ఇచ్చుకుంటూ వచ్చింది. బుధ గురు వారాల్లో కూడా ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు తదుపరి విచారణను అక్టోబరు 13కు వాయిదా వేశారు. అప్పటిదాకా టెండర్ల ప్రక్రియ కూడా ఆలస్యం కాక తప్పని పరిస్థితి ఏర్పడింది.