అభాసుపాలయిన ఎంపీ కేశినేని

Update: 2017-10-28 12:30 GMT

విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నానికి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. చిన్న విషయమే అయినా ఎంపీ నాని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్నికలో అభాసుపాలు కావాల్సి వచ్చింది. జగ్గయ్యపేట మున్సిపాలిటీలో మొత్తం 27 వార్డులున్నాయి. 2014 లో జరిగిన ఎన్నికల్లో వైసీపీకి 16 డివజన్లు, టీడీపీకి 10 డివిజన్లు, ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచారు. అయితే 2014లో వైసీపీలో రెండు వర్గాలు మున్సిపల్ ఛైర్మన్ పదవి కోసం పోటీ పడగా మూడేళ్లు ఒకరికి, రెండేళ్లు మరొకరికి ఇస్తామని పెద్దమనుషుల ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం తొలుత జగ్గయ్యపేట మున్సిపల్ ఛైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన రాజగోపాల్ ఇటీవల పదవి నుంచి తప్పుకున్నారు. తిరిగి మున్సిపల్ ఛైర్మన్ పదవి ఎన్నిక నిర్వహించాల్సి వచ్చింది. అయితే ఈ ఎన్నికలో ఎలాగైనా విజయం సాధించాలని అధికార టీడీపీ భావించింది. తమకు పది స్థానాలున్నా... కో ఆప్షన్ మెంబర్లతో కలిపిఆ సంఖ్య 13కు చేరుకుంది.

బలం లేకున్నా...బరిలోకి దిగి.....

దీంతో విజయవాడ ఎంపీ కేశినేని నాని రంగంలోకి దిగారు. 16 మంది వైసీపీ నేతల్లో ముగ్గురిని చీల్చేందుకు ప్రయత్నించారు. ఎర వేశారు. కాని సాధ్యం కాలేదు. దీంతో శుక్రవారం జగ్గయ్యపేట మున్సిపల్ ఎన్నిక జరగాల్సి ఉంది. ఈ ఎన్నికకు అంతా సిద్ధమైంది. ఈ పరిస్థితుల్లో వైసీపీ ఛైర్మన్ గా పోటీ చేస్తున్న రాజగోపాల్ అలియాస్ చిన్నా పై రౌడీషీట్ ఉందని టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. నిన్న కోరం ఉన్నప్పటికీ ఎన్నిక జరగకుండా టీడీపీ నేతలు అడ్డుకున్నారు. భారీ ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినా ఫలితం లేదు. రెండు వర్గాలు ఘర్షణకు దిగే పరిస్థితికి వచ్చాయి. ఎన్నికల అధికారి టేబుల్ ను కూడా టీడీపీ సభ్యులు ఎత్తివేశారు. విజయవాడ ఎంపీ నాని కౌన్సిల్ హాలులోనే ఉండి జరగుతున్నదంతా చూశారు. చివరకు ఏమీ చేయలేక ఎన్నికను వాయిదా వేశారు. ఈరోజు జరిగిన ఎన్నికల్లో తనకు బలం లేదని తెలిసిన టీడీపీ ఎన్నికను బహిష్కరించింది. దీంతో వైసీపీ అభ్యర్థి రాజగోపాల్ ఎన్నికయ్యారు. అయితే బలం లేకున్నా ఈ ఎన్నికల్లో గెలవాలని ఎంపీ నాని ప్రయత్నించడం సొంత పార్టీలోనే విమర్శలకు తావిచ్చింది. ఎందుకు అంతగా ప్రయత్నించాలని, ఎటూ ఓడిపోతామని తెలిసి అక్కడకు వెళ్లాల్సిన అవసరమేముందని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర మాత్రమే గడువు ఉన్నా...టీడీపీ ఎంపీ ఎందుకు తొందరపడ్డారో అర్ధం కాకుండా ఉందని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. ఎంపీ కేశినేని నాని అనవసరంగా రంగంలోకి దిగి పరువు పోగొట్టుకున్నారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

Similar News