అద్భుత వ్యూహాలను రచించడం వాటిని పక్కాగా అమలు చేయడం తెలంగాణ సీఎం కేసీఆర్ కి వెన్నతో పెట్టిన విద్య. ఆయన సామర్ధ్యం ఏమిటన్నది తెలంగాణ ఉద్యమంలో అన్ని పార్టీలు రుచి చూశాయి. తెలంగాణకు ఒక్క సిపిఎం పార్టీ తప్ప ఏ పార్టీ కూడా వ్యతిరేకం కాదంటూ నాడు కాంగ్రెస్ సర్కార్ కి లేఖలు సైతం రాసిచ్చేలా కేసీఆర్ వ్యూహం నడిచింది. ఆ వ్యూహాల ఫలితమే ఆయన్ను ముఖ్యమంత్రి పదవిని బహుమానంగా దక్కేలా చేసింది. తాజాగా రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సైతం కేసీఆర్ ఒక ప్రత్యేక వ్యూహంతో సిద్ధమయ్యారు. దాని రచన పూర్తి అయ్యింది. కార్యాచరణ వైపు అడుగులు పడుతున్నాయి.
బిసి డిక్లరేషన్ తో అన్ని పార్టీలను క్లిన్ బౌల్డ్ చేస్తారా ...?
టి సీఎం అన్ని పార్టీలపై ఒక గురుతర బాధ్యత పెట్టారు. అదేమిటంటే అందరు కలిసి మూడు రోజులపాటు చర్చించి వెనుకబడిన తరగతులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి ? వాటి పరిష్కారం ఏమిటి ? అనే రెండు పాయింట్లపై ఒక నివేదిక అందజేయాలి. వారు సమస్యలపై ఇచ్చిన నివేదికను యధావిధిగా ఆమోదించి కొత్త జీవోలు ఇంకా అవసరమైతే కొత్త చట్టాలు టి సర్కార్ చేయనుంది. వీటికి తోడు చట్టసభల్లో బిసిలకు రిజర్వేషన్లు ఇచ్చే ప్రయత్నానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇవన్నీ తయారు చేసే పనిని ఎవరైతే తమ పార్టీపై దుమ్మెత్తి పోస్తున్నారో ఆ విపక్షాలకు కేసీఆర్ అప్పగించారు. వారు తయారు చేసి ఇచ్చిన డిక్లరేషన్ ఆమోదించాక ఆయనపై ఆయా పార్టీలు విమర్శలు, ఆరోపణలు చేసే అవకాశమే లేకుండా చేయడమే కేసీఆర్ ఎత్తుగడ.
టిడిపి, బిజెపి, కాంగ్రెస్ లు ప్రశంసలు ...
కేసీఆర్ నిర్వహిస్తున్న బిసి సమస్యల పరిష్కార చర్చా కార్యక్రమంలో పాల్గొన్న వివిధ పార్టీల నేతలు సీఎం పై ఇప్పటికే ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. తన నలభై ఏళ్ళ పోరాటంలో ఇలాంటి ప్రయత్నం ఏ ముఖ్యమంత్రి చేయలేదని టిడిపి ఎమ్యెల్యే బిసి ఐకాన్ ఆర్ కృష్ణయ్య కేసీఆర్ ను ఆకాశానికి ఎత్తేశారు. బిసిల సమస్యలు నిర్లక్ష్యం చేస్తుందని నిన్న మొన్నటి వరకు సర్కార్ పై ఒంటికాలిపై లేచిన బిజెపి , కాంగ్రెస్ నేతలు సైతం తాజాగా సీఎం సూపర్ అంటూ వ్యాఖ్యానించారు. బిజెపి టి అధ్యక్షుడు లక్ష్మణ్, కాంగ్రెస్ నేత రాపోలు ఆనంద్ భాస్కర్ కేసీఆర్ ప్రయత్నాన్ని కొనియాడారు.
కేసీఆర్ ఇలా బుట్టలో వేశారు ...
నాకు తెలిసింది కొంతే మీకు గ్రౌండ్ లెవెల్ లో అన్ని తెలుసు. బిసిలకు న్యాయం చేసేందుకు వున్న అవకాశాలు అన్ని పరిశీలించండి. మీరు చెప్పినవన్నీ చేయడానికి సిద్ధంగా వున్నా అంటూ తనదైన శైలిలో విపక్షాలకు పెద్ద పీట ఇచ్చారు కేసీఆర్. అంతే కాదు ఈ సమస్యలు ఒక్క రోజులో తెలియవు మూడు రోజులపాటు చర్చించండి ఫైనల్ డే వస్తా మీరు ఇచ్చినవి ఒకే చేస్తా . అసెంబ్లీ ని సైతం సమావేశ పరిచి ఈ అంశాలపైనే మాట్లాడదాం అంటూ టి సీఎం అనడంతో విపక్ష నేతలు ఫిదా అయ్యారు. రాబోయే రోజుల్లో వారు కులాల వారీగా ఓటు బ్యాంక్ లకు చిల్లులు పెట్టె ఛాన్స్ లేకుండా ప్రతిపక్ష పార్టీలతోనే తన పని విజయవంతంగా పూర్తి చేస్తున్న కేసీఆర్ వ్యూహం ఆయనకు ప్లస్ గా మారుతుందన్నది విశ్లేషకుల అంచనా.