అన్నాడీఎంకే....దానికి దూరంగా...?

Update: 2018-03-18 16:30 GMT

ఆంధ్రప్రదేశ్ లోని టీడీపీ కేంద్ర ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానానికి అన్నాడీఎంకే మద్దతివ్వబోవట్లేదు. దీంతో తమిళనాడులో అన్నాడీఎంకే గుట్టు బహిరంగమైందని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. అన్నాడీఎంకేకు 37 మంది పార్లమెంటు సభ్యుల బలం ఉంది. లోక్ సభలోనే అతిపెద్ద మూడో పార్టీగా అన్నాడీఎంకే ఉంది. అయితే జయలలిత బతికున్న కాలంలో అన్నాడీఎంకే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఉండేది. రాష్ట్ర ప్రయోజనాలను సాధించుకోవడానికి జయలలిత అనేకసార్లు కేంద్రాన్ని తన పార్టీకున్న బలంతో దారికి తెచ్చుకున్నారు కూడా.

జయ మరణం తర్వాత....

కాని జయలలిత మరణం తర్వాత నాయకత్వలేమితో సతమతమవుతున్న అన్నాడీఎంకే అవిశ్వాసానికి మద్దతు ప్రకటిచండం లేదని తెలుస్తోంది. సోమవారం మరోసారి అవిశ్వాసం లోక్ సభ ముందుకు రానుంది. బీజీపీ కూడా అవిశ్వాసానికి సై అంటుంది. బలం లేని వాళ్లు అవిశ్వాసం అంటే తామెందుకు జంకుతామని ప్రశ్నిస్తుంది. అలాగే ఏపీకి తాము చేసిన ప్రయోజనాలను కూడా వివరిస్తామని స్వయంగా అమిత్ షా యే మీడియాకు వెల్లడించారు. లోక్ సభలో గందరగోళ పరిస్థితులు తలెత్తకుండా చూసుకోవాల్సిన బాధ్యత విపక్షాలదేనని ఆయన అన్నారు.

అమిత్ షా స్వయంగా....

అయితే టీడీపీ, వైసీపీ పెట్టిన అవిశ్వాసానికి మద్దతు పెరుగుతుండటంతో అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఓటమి భయం కాదు కాని తమ వెంట ఎవరూ లేరన్న సంకేతాలు వెళ్లకూడదనే ఎన్డీఏకు సన్నిహితంగా ఉన్న పక్షాలతో కూడా ఆయన మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే అన్నాడీఎంకే అధినేతలు పళనిస్వామి, పన్నీర్ సెల్వంతో మాట్లాడారు. అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని కోరినట్లు తెలిసింది. ఈ మేరకు అన్నాడీఎంకే కూడా అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఓటు వేయాలనే నిర్ణయించుకున్నట్లు సమాచారం.

వత్తిడి పెంచుతున్న స్టాలిన్.....

అయితే డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ మాత్రం అన్నాడీఎంకే తీరుపై విరుచుకుపడుతున్నారు. కేంద్రం అడుగులకు మడుగులు వత్తకుండా కావేరీ జలాల నీటి శాతాన్ని కర్ణాటకకు ఎక్కవుగా పెంచిన కేంద్ర ప్రభుత్వంపై పోరాడాల్సిందేనని స్టాలిన్ చెబుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టి కేంద్రంతో చేతులు కలపవద్దని కోరుతున్నారు. కావేరీ యాజమాన్య మండలిని ఏర్పాటు చేసే విధంగా కేంద్రంపై వత్తిడి తెచ్చేందుకు అన్ని పార్టీలనూ కలుపుకుని పోవాలని స్టాలిన్ పిలుపు నిచ్చారు. మొత్తం మీద అన్నాడీఎంకే అవిశ్వాసానికి దూరంగా ఉండాలనే నిర్ణయించుకుందన్నది సమాచారం.

Similar News