తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి దినకరన్ నిద్రపోనివ్వడం లేదు. ఎమ్మెల్యేలను తమ వైపునకు తిప్పుకునేందుకు దినకరన్ సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. పదిహేను రోజుల్లో తమిళనాడులో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటాయని తెలుస్తోంది. అధికార పార్టీ అన్నాడీఎంకే నుంచి దాదాపు పది మంది ఎమ్మెల్యేలు దినకరన్ గూటికి వెళతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే పళనిస్వామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంతకాలు చేసి గవర్నర్ కు ఇచ్చిన 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. వీరంతా దినకరన్ వర్గానికి చెందిన వారు. అయితే అనర్హత వేటుపై దినకరన్ వర్గం కోర్టును ఆశ్రయించింది. కోర్టు తీర్పు ఇంకా రాలేదు.
అనర్హత వేటు పడిన తర్వాత కూడా....
అయితే స్పీకర్ 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసినా మరో ఎమ్మెల్యే టీటీవీ చెంతకు చేరడం చర్చనీయాంశమైంది. అన్నాడీఎంకే ఎమ్మెల్యే ప్రభు దినకరన్ కు మద్దతు తెలిపి పళని సర్కార్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అదే బాటలో మరో పది మంది ఎమ్మెల్యేలున్నట్లు ప్రచారం జోరుగా సాగుతుంది. వీరంతా ఉత్తర, దక్షిణ తమిళనాడు జిల్లాలకు చెందిన వారుగా అనుమానిస్తున్నారు. వీరంతా మంత్రి పదవులు తమకు దక్కలేదన్న అసంతృప్తితో ఉన్నవారు కొందరైతే, పళని, పన్నీర్ కలయికను జీర్ణించుకోలేక పోతున్నవారు మరికొంత మంది ఉన్నారని తెలుస్తో్ంది.
పళని అప్రమత్తమయినా....
అయితే ఇటీవల ఎమ్మెల్యే ప్రభు దినకరన్ వర్గంలోకి జంప్ అయినప్పడే పళనిస్వామి అప్రమత్తమయ్యారు. నిఘా సంస్థలను అలెర్ట్ చేశారు. పళనిస్వామికి అందిన ఇంటలిజెన్స్ రిపోర్టు కూడా దాదాపుగా ఉత్తర, దక్షిణ తమిళనాడు ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలు సర్కార్ పై అసంతృప్తితో ఉన్నట్లుతేలడంతో వారితో ప్రత్యేకంగా సమావేశం కావాలని నిర్ణయించారు. వారి అసంతృప్తులు తొలగించి మరో ఎమ్మెల్యే జారిపోకుండా పళని చర్యలు ప్రారంభించారు. అయితే ఈ విషయంలో పన్నీర్ సెల్వం దారి వేరేరకంగా ఉంది. ఆయన పెద్దగా దినకరన్ విషయాలను పట్టించుకోవడం లేదని పళనిస్వామి వర్గం గుర్రుగా ఉంది.
శశికళ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా?
అయితే దినకరన్ దూకుడు పెంచడానికి మరో కారణం ఉందంటున్నారు. నిన్న మొన్నటి వరకూ పార్టీ ఎమ్మెల్యేలను తమ చెంతకు లాక్కుని, ప్రభుత్వాన్ని కూలదోయడాన్ని శశికళ అభ్యంతరం వ్యక్తం చేశారు. మన ప్రభుత్వాన్నే మనం పడగొడితే ఎలా? అని ఒక దశలో దినకరన్ కు వార్నింగ్ కూడా శశికళ ఇచ్చారట. అయితే తాజాగా గత నెల 19వ తేదీన పరప్పణ అగ్రహార జైలులో ఉన్న శశికళను దినకరన్ కలిశారు. ఈ సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేలను లాక్కునేందుకు చిన్నమ్మ పర్మిషన్ ఇచ్చినందునే టీటీవీ మళ్లీ తన ప్రయత్నాలను ముమ్మరం చేశారంటున్నారు. మొత్తం మీద దినకరన్ చెప్పినట్లు మూడు నెలల్లో ప్రభుత్వాన్ని కూల్చి వేస్తానని చెప్పినట్లుగానే అన్నంత పని చేస్తాడా? అన్న అనుమానం అన్నాడీఎంకేలో ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. మొత్తం మీద తమిళనాడు అధికార పార్టీలో రానున్న పది, పదిహేను రోజుల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకునే అవకాశముందంటున్నారు.