అనంతలో టీడీపీ కాంట్రాక్టర్ దారుణం...!

Update: 2017-12-05 02:30 GMT

అది అనంతపురంలోని సుభాష్ నగర్ షాపింగ్ కాంప్లెక్స్ ప్రాంతం. పని ముగించుకుని తాపీగా వస్తున్న అనంతపురం కార్పొరేషన్ డీఈఈ కిష్టప్ప ని సినిమాల్లో చుట్టుముట్టినట్లు రౌడీలు చుట్టేశారు. ఏరా బిల్లులు ఇమ్మంటే ఇవ్వవా అంటూ అరుస్తూ చితకొట్టేశాడు అధికారపార్టీ కి చెందిన నర్సింహా రెడ్డి అనే కాంట్రాక్టర్. కత్తి ఇవ్వండి రా వీడి సంగతి తెలుస్తా అంటూ పబ్లిక్ గ్గా ప్రభుత్వ అధికారి అని కూడా చూడకుండా కుళ్ళ బొడిచేశాడు. ఫ్యాక్షన్ రాజకీయాలకు అలవాటు పడిన ప్రాంతం కావడంతో అటు ఇటు వెళ్ళే వారు వచ్చే వారు ఇంతటి దారుణాన్ని చూసి చూడనట్లు చూసి పోయారు. బాంబులేసి లేపేస్తా అని వార్నింగ్ కూడా ఇచ్చాడు.

ఫిర్యాదు చేసిన మేయర్ ...

కార్పొరేషన్ డీఈ కిష్టప్ప పై జరిగిన దారుణమైన దాడికి మేయర్ ఎం.స్వరూప స్పందించి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. దాడి జరిపిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. మరోవైపు ఈ సంఘటనపై ఉద్యోగ వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. తమకు ఇలాంటి కాంట్రాక్టర్ల నుంచి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశాయి. కార్పొరేషన్ పరిధిలో చెత్త మిషన్ ద్వారా 25 లక్షల రూపాయల పనికి సంబంధించి నర్సింహారెడ్డి బిల్లులకు తిరుగుతున్నా డీఈ అడ్డుపడుతుండటంతో వివాదం రోడ్డెక్కి తన్నులాటకు దారితీసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News