వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర అనంతపురం జిల్లాలో ముగిసింది. మొత్తం 9 నియోజకవర్గాలలో ఈ పాదయాత్ర కొనసాగింది. 24 రోజుల పాటు జగన్ అనంతపురంజిల్లాలో పాదయాత్ర చేశారు. అనంతలో పాదయాత్రను ముగించుకున్న జగన్ కొద్దిసేపటి క్రితమే చిత్తూరు జిల్లాలో ప్రవేశించారు. అయితే అనంతలో జగన్ పాదయాత్ర ఇంతకూ అనంతపురం జిల్లాలో సక్సెస్ అయినట్లేనా? కాదా? అన్నదానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.
ప్రజల నుంచి మంచి స్పందన...
అనంతపురం జిల్లాలో గత ఎన్నికల్లో వైసీపీ తీవ్రంగా నష్టపోయింది. రాయలసీమలోని ముఖ్యమైన జిల్లాలోనే దెబ్బ పడటంతో జగన్ అధికారానికి దూరమయ్యారు. దీంతో పాదయాత్ర ద్వారా అనంతలో పట్టు సాధించాలని జగన్ భావించారు. ఈ మేరకు ఉరవకొండ, రాప్తాడు, కదిరి, తాడిపత్రి వంటి కీలక నియోజకవర్గాల్లో పర్యటించారు. ముఖ్యంగా పరిటాల సునీత, జేసీ సోదరులు, పయ్యావుల కేశవ్ లను టార్గెట్ చేసుకునే ఈ పాదయాత్ర సాగిందనే చెప్పొచ్చు. ఈ నియోజకవర్గాల్లో ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. అడగడుగునా జగన్ కు జనం హారతులు పట్టారు.
నేతల్లో కొరవడిన సమన్వయం...
అయితే జగన్ అనంతపురంలో పాదయాత్ర ప్రవేశించకముందే ఆ పార్టీలో కీలక నేత గుర్నాధరెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పారు. అంతేకాదు కొందరు నేతలు పాదయాత్రకు దూరంగా ఉండటం కూడా చర్చనీయాంశమైంది. శివరామిరెడ్డి వంటి నేతలు పాదయాత్రలో పాల్గొనలేదు. మరోవైపు కాంగ్రెస్ నేత మధుసూదన్ గుప్తా లాంటి వారు జగన్ కు మద్దతు పలికారు. ప్రధానంగా వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఆశిస్తున్న నేతలు కొందరు కన్పించినా ఎక్కువ మంది దూరంగానే ఉండటం పార్టీకి నష్టం కల్గించే అంశమని చెప్పక తప్పదు. అనంతపురంలో జగన్ పాదయాత్ర చేస్తున్నప్పుడు క్యాడర్ ఎటువంటి కార్యక్రమాలు చేపట్టకపోవడం గమనార్హం. ముందస్తుగా యువభేరి, పల్లెనిద్ర వంటి కార్యక్రమాలుచేపట్టాలనిజగన్ సూచించినా పార్టీ నేతలు పెద్దగా పట్టించుకోలేదు. అయితే అధికారపార్టీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, ఆ పార్టీలో ఉన్న విభేదాలు తమకు లాభం చేకూరుస్తాయని వైసీపీ నేతలు విశ్లేషించుకోవడం తప్పించి... పార్టీ పటిష్టతకు ఎలాంటి కృషి నేతలు చేయలేదన్న విమర్శలు ఉన్నాయి. జగన్ పాదయాత్ర ముగిసిన తర్వాతైనా జిల్లాలో పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేయాలని నేతలను వైసీపీ అభిమానులు కోరుతున్నారు.