అనంతపురం వద్దు....నెల్లూరు ముద్దు...!

Update: 2017-10-31 04:30 GMT

తెలంగాణ సర్కార్ ఆర్భాటంగా అమలు చేసిన గొర్రెల పథకం ఆశించిన స్థాయిలో సత్ఫలితాలనివ్వడం లేదు. ఇప్పటికే లక్షల సంఖ్యలో గొర్రెలు లబ్దిదారులకు పంపిణీ చేశారు. గొర్రెల పెంపకందార్లకు భరోసా ఇచ్చే పథకం క్షేత్రస్థాయిలో నిర్వీర్యమవుతుంది. కొందరు లబ్దిదారులు నిబంధలనకు విరుద్ధంగా గొర్రెలను అయినకాడికి అమ్మేసుకుంటున్నారు. మూడు నెలల వరకూ గొర్రెలను విక్రయించకూడదన్న నిబంధనను వారు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో పంపిణీ చేసిన గొర్రెలను లెక్కించడానికి అధికారులు సిద్ధమయ్యారు. మూడు నెలలు పెంచితే ఎక్కువ ధర పలుకుతుందని, మరికొన్ని గొర్రెలు అధికమవుతాయన్నది ప్రభుత్వ భావన. కాని ఈ పథకానికి కొందరు లబ్దిదారులే తూట్లు పొడుస్తున్నారు. డ్రా పద్ధతిలో లబ్దిదారులను ఎంపిక చేసి ఎటువంటి విమర్శలకు రాకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంది. అయినా గొర్రెల అమ్మకాలు యధేచ్ఛగా సాగిపోతున్నాయి.

నెల్లూరు గొర్రెలు కావాలి....

మరోవైపు పంపిణీ చేసిన గొర్రెలు మరణిస్తున్నాయి. గొర్రెలను ఎక్కువగా తెలంగాణ సర్కార్ అనంతపురం జిల్లా నుంచి కొనుగోలు చేసింది. అయితే వాతావరణ పరిస్థితులు మారడం వల్లనో... ఇతర కారణాల వల్లనో తెలియదు కాని వేల సంఖ్యలో గొర్రెలు చచ్చిపోతున్నాయి. గాలికుంటు వ్యాది, మూతి వాపు, శ్వాసకోశ వ్యాధులతో వేలసంఖ్యలో గొర్రెలు మరణిస్తున్నాయి. అయితే మరణించిన గొర్రెలకు ముందుగా ప్రభుత్వం బీమా సౌకర్యం కూడా కల్పించింది. ఒక్కొక్క యూనిట్ కు 2580 రూపాయల బీమా సొమ్మును కూడా లబ్దిదారులు చెల్లించారు. ఒక్క వరంగల్ జిల్లాలో నాలుగు లక్షల గొర్రెలను పంపిణీ చేస్తే దాదాపు పదివేల గొర్రెలు మృత్యువాత పడ్డాయి. అయితే బీమా సౌకర్యం ఇంతవరకూ లబ్దిదారులకు అందలేదు. దీంతో లబ్దిదారులు తమకు అనంతపురం జిల్లా గొర్రెలు వద్దని, నెల్లూరు జాతి గొర్రెలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద టీఆర్ఎస్ సర్కార్ ఆర్భాటంగా ప్రకటించిన గొర్రెల పథకం ఆదిలోనే అభాసుపాలయినట్లేనన్నవిమర్శలు విన్పిస్తున్నాయి.

Similar News