అనంత వేదికగా నవంబరు 10న పవన్ సభ

Update: 2016-10-24 14:14 GMT

పవన్ ప్రత్యేక హోదా కోసం జరుపుతున్న పోరాటంలో ఇంకో సభ జత కానుంది. నవంబరు 10 వ తేదీన అనంతపురంలో భారీ బహిరంగ సభ నిర్వహించడానికి పవన్ కల్యాణ్ ముహూర్తం ప్రకటించారు. పవన్ కల్యాణ్ జనసేన పార్టీ అధినేతగా.. ఇప్పటికే తిరుపతిలోను, కాకినాడలోను బహిరంగసభలు నిర్వహించిన సంగతి తెలిసిందే. కాకినాడ సభను చాలా పెద్దస్థాయిలోనే నిర్వహించారు. ప్రత్యేకహోదా కావాలనే డిమాండ్ ను గట్టిగానే వినిపించారు. అయినా అటు కేంద్రంలో గానీ, ఇటు రాష్ట్రప్రభుత్వంలో గానీ వచ్చిన కదలిక మాత్రం శూన్యం. కాకినాడ సభ తర్వాత.. పవన్ కల్యాణ్ మళ్లీ హోదా గురించి మాటాళ్లేదు. ఉద్యమ కార్యాచరణ ఊసెత్తలేదు.

తీరా ఇప్పుడు నవంబరు 10న అనంతపురం సభను ప్రకటించారు. ప్రత్యేకహోదా గురించి పవన్ కల్యాణ్ కంటె ముందునుంచి పోరాటం సల్పుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నవంబరు 6వ తేదీన విశాఖపట్టణంలో భారీ ఎత్తున బహిరంగ సభ నిర్వహించడానికి నిర్ణయించి, దానికి సంబంధించి పోస్టరును కూడా విడుదల చేసిన తర్వాత.. పవన్ కల్యాణ్ జనసేన పార్టీ తరఫున నాలుగు రోజుల వ్యవధిలో అనంతపురంలో తాము సభ పెట్టబోతున్నట్లు ప్రకటించడం విశేషం.

వైకాపా పెట్టదలచుకున్న సభ కంటె భారీ జన సమీకరణతోనే.. జనసేన అనంతపురంలో సభ పెట్టాలని అనుకుంటున్నట్లు సమాచారం. అనంతపురం గతంలో సమైక్యాంధ్ర ఉద్యమం జరిగినప్పుడు, ఆ తర్వాత ప్రత్యేకహోదా కావాలనే వాణిని వినిపించడంలో కూడా కీలక భూమికనే పోషించింది. అందుకే పవన్ కల్యాణ్ తన మూడో సభకు అనంతను వేదికగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

Similar News