‘అనంత’ లో జగన్ గోల్ కొట్టేస్తారా?

Update: 2017-12-04 08:30 GMT

అనంతపురం జిల్లాలోకి కాలుమోపిన వైసీపీ అధినేత జగన్ కు అపూర్వ స్వాగతం లభించింది. కడప, కర్నూలు జిల్లాలో ప్రజాసంకల్ప పాదయాత్రను పూర్తి చేసుకున్న జగన్ ప్రస్తుతం అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. కరవు కాటకాలతో నిత్యం అల్లాడే అనంతపురం జిల్లాలో ప్రజలు జగన్ కు బ్రహ్మరధం పట్టారు. అడుగడుగునా స్వాగతాలు చెప్పారు. గుంతకల్ నియోజకవర్గంలోకి జగన్ ఈరోజు ప్రవేశించారు. అనంతపురం అనగానే కరువు గుర్తుకొస్తుంది. సాగు, తాగునీరు లేక వేలాది కుటుంబాలు వలసబాట పడుతున్నాయి. ముఖ్యంగా బెంగళూరు, ముంబయి, హైదరాబాద్ లకు జీవనోపాధి కోసం కుటుంబాలకు కుటుంబాలే తరలి వెళుతున్నాయి. రాయలసీమ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా కేటాయించిన నిధులను ఖర్చు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం అనంతపురం జిల్లాను నిర్లక్ష్యం చేస్తోందిని జగన్ ఆరోపిస్తున్నారు.

స్థానిక సమస్యలనే ప్రస్తావిస్తూ....

అనంతపురం జిల్లా రైతులు ఇటీవలే పోస్ట్ కార్డ్ ఉద్యమాన్ని కూడా నిర్వహించారు. ఏకంగా ప్రధాని మోడీకి లక్షల కొద్దీ పోస్ట్ కార్డులపై తమ దయనీయస్థితిని తెలియజేస్తూ పంపారు. రాయలసీమలో అత్యంత వెనకబడిన ప్రాంతమైన అనంతపురం జిల్లాలో 300 మంది రైతలు ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుల బాధలు తాళలేక వారు బలవన్మరణానికి పాల్పడ్డారు. కాని రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేవలం 45 మందికే నష్టపరిహారం అందించిందని వైసీపీ ఆరోపిస్తుంది. ఈజిల్లాలో చేనేత కార్మికులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో్ అనంతపురంజిల్లాలో తొలిరోజు పర్యటనకు అపూర్వ స్పందన లభించడంతో వైసీపీ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. నేతలు పార్టీని వీడి వెళ్లినా ప్రజలు తమ చెంత ఉన్నారని వైసీపీ వర్గాలు ధీమాగా చెబుతున్నాయి. ఈరోజు సాయంత్రం గుత్తిలో జరిగే బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగించనున్నారు.

Similar News