అనంతపురంలో అధికార పార్టీలో వణుకు ప్రారంభమైంది. పవన్ కల్యాణ్ రూపంలో ఎవరు ఎర్త్ పడుతుందో తెలియని పరిస్థితి. దీంతో ఎవరికి వారే అనంత నేతలు పవన్ పోటీ చేసే స్థానంపై ఆరాతీస్తున్నారు. పవన్ కల్యాణ్ ఈ నెల 27వ తేదీ నుంచి అనంతపురంలో కరవు యాత్రను ప్రారంభించనున్నారు. మూడు రోజుల పాటు అనంతపురం జిల్లాలోనే పవన్ ఉంటారు. అంతేకాదు అనంతపురంలో తొలి పార్టీ కార్యాలయానికి ఆయన భూమి పూజను చేయనున్నారు. కరవు యాత్ర పేరిట పూర్తిగా గ్రామసీమల్లోనే పవన్ పర్యటించనున్నారు.
కరవు యాత్ర పేరుతో....
పవన్ కరువు యాత్రతో జనంలోకి వస్తుండటం అనంత అధికార పార్టీ నేతలకు మింగుడుపడటం లేదు. ఇప్పటి వరకూ కరువు జిల్లాకు నీరు తెస్తామని, పరిశ్రమలను నెలకొల్పుతామని హామీలు ఇచ్చిన అధికార పార్టీ ఇప్పటి వరకూ చేసింది తక్కువే. దీంతో పవన్ పర్యటనపై నేతల్లో కొంత టెన్షన్ నెలకొంది. అంతేకాకుండా జనసేన పార్టీ తొలిసారి అనంతపురం నుంచే కార్యకర్తలను ఎంపిక చేసింది. గుత్తిరోడ్డులోని తడకలేరు సమీపంలోని రెండు ఎకరాల స్థలంలో పార్టీ కార్యాలయాన్ని నిర్మించనున్నారు. ఈ స్థలాన్ని ఇరవై ఏళ్లపాటు లీజుకు తీసుకున్నారు. అంతేకాకుండా ఈ నెల28న కదిరి వెళ్లి లక్ష్మీ నరసింహ స్వామిని పవన్ కల్యాణ్ దర్శించుకోనున్నారు.
ఎక్కడ నుంచి పోటీ....
అయితే గత ఎన్నికల్లో అనంతపురం జిల్లాయే తెలుగుదేశం పార్టీని ఆదుకుంది. మొత్తం 14 అసెంబ్లీస్థానాల్లో 12 స్థానాలను అనంత ప్రజలు టీడీపీకే కట్టబెట్టారు. రెండు పార్లమెంటు స్థానాలనూ తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో పవన్ అనంతపురం జిల్లా నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. అయితే పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న ఆసక్తి అధికార పార్టీ నేతల్లో నెలకొంది. పవన్ తమ స్థానాన్ని ఎక్కడ ఎంచుకుంటారోనన్న ఉత్కంఠ కూడా వారికి లేకపోలేదు. అందుకే పవన్ కల్యాణ్ వ్యక్తిగత సలహాదారులకు ఫోన్ చేసి మరీ అనంత నేతలు పవన్ పోటీ చేసే స్థానంపై ఆరాతీస్తున్నారట. పవన్ వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసినా ఆ స్థానంలో గెలవడం కష్టమేనన్నది తమ్ముళ్ల బాధ. అలాగే టీడీపీతో పొత్తు పెట్టుకున్నా ఆ స్థానాన్ని తాము వదులుకోవాల్సిందేనన్న ఆవేదన.. దీంతో అనంత తెలుగుతమ్ముళ్లు అజ్ఞాతవాసి దెబ్బకు బెంబేలెత్తిపోతున్నారు. తమ సీటుకు ఎక్కడ ఎసరు పెడతారోనని హడలిపోతున్నారు.