ఏపీ అధికార పార్టీ టీడీపీలో సంక్రాంతి జోష్ అప్పుడే మొదలైపోయింది! అదేంటి అనుకుంటున్నారా.. ? నిజమే! రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం నుంచి ప్రారంభమైన జన్మభూమి-మా ఊరు కార్యక్రమాన్ని టీడీపీ అనధికారికంగా సంక్రాంతిగా మార్చేసింది. 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నిర్వహిస్తున్న భారీ కార్యక్రమం ఇది ఒక్కటే కావడంతో చంద్రబాబు దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎన్నికల సమయానికి కోడ్ అడ్డం వచ్చే అవకాశం ఉండడంతో బాబు ఈ కార్యక్రమాన్ని సంక్రాంతి కన్నా ఎక్కవ జోష్‌తో నిర్వహించేందుకు పక్కా ప్లాన్‌తో ముందుకు సాగుతున్నారు. మంగళవారం నుంచి 11వ తారీకు వరకు నిర్విరామంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ఈ కార్యక్రమం ద్వారా ప్రజలపై వరాల వర్షం కురిపించేందుకు బాబు రంగం సిద్ధం చేశారు.
సంక్షేమ పథకాలన్నింటినీ....
గత మూడున్నరేళ్ల పాలనలో సాధించిన విజయాలను ఏకరువు పెట్టడంతో పాటు ఈ ఏడాది చేయాలని భావిస్తున్న కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని బాబు డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ నిరంతర విద్యుత్, ఎల్‌పీజీ కనెక్షన్లు, పట్టిసీమ, పురుషోత్తపట్నం, పోలవరం ప్రాజెక్టులు వంటి వాటిని పూర్తి చేయడం, రైతులకు 24000 కోట్ల రుణ మాఫీ వంటి కీలక అంశాలను ఈ కార్యక్రమాల్లో ప్రముఖంగా ప్రస్తావించే అవకాశం కనిపిస్తోంది. మొత్తంగా జన్మభూమి కార్యక్రమం ఆసాంతం సంక్రాంతికి ముందు సంక్రాంతిగా మారే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వంలోని అన్ని విభాగాల్లోనూ సెలవులు రద్దు చేశారు.
అడిగిన వారికి అడిగినట్లు....
అదే విధంగా యంత్రాంగాలను ఊళ్లకు పంపారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఇక, ఎక్కడికక్కడ జిల్లా కలెక్టర్లు ఈ కార్యక్రమాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. అడిగిన వారికి అడిగినట్టు రేషన్ కార్డులు, పింఛన్లు వంటివి కూడా మంజూరు చేయనున్నారు. ప్రభుత్వం వివిధ దశల్లో చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరించే అవకాశం కూడా ఉంది. ఇక, అదే సమయంలో విపక్షం నుంచి ఎదురయ్యే ప్రతిఘటనను, విమర్శలను నిలువరించేందుకు కూడా బాబు పక్కా ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. ఎక్కడికక్కడ... కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఇప్పటికే ఆదేశించారు. దీంతో ఈ కార్యక్రమం ఆసాంతం ఎన్నికలకు ముందు టీడీపీ నిర్వహిస్తున్న సంక్రాంతిగా మారిపోయిందని విశ్లేషకులు భావిస్తున్నారు.