ఎన్నికల కమిషన్ వైఖరితో ఇక పొలిటికల్ లీడర్ల కరప్షన్ కు చెక్ పడుతుందా? రాజకీయ నేతలు ఏదైనా కేసులో దోషులుగా నిర్ధారణ అయితే జీవితకాలం ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టుకు నివేదించింది. ఈరోజు తన అభిప్రాయాన్ని సుప్రీంకోర్టుకు తెలియజేయడంతో రాజకీయ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. అవినీతి ఆరోపణలు, మరేదైనా కేసుల్లో దోషులుగా తేలితే ఆ రాజకీయ నేతలు ఎన్నికలలో పోటీ చేయకుండా జీవితకాలం నిషేధం విధించాలని న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఏడాది జులైలో ఈ పిటిషన్ విచారించిన సుప్రీంకోర్టు దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.
స్పష్టంగా ఈసీ వైఖరి......
జీవితకాలం నిషేధం విధించాలంటే ఎన్నికల కమిషన్ చేయాల్సి ఉంటుందని సుప్రీం అభిప్రాయపడింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్ వైఖరిని కోరింది. ఈ మేరకు బుధవారం ఎన్నికల కమిషన్ తన అభిప్రాయాన్ని స్పష్టం చేసింది. రాజకీయ నేతలపై నేరం రుజువైనప్పుడు వారిపై జీవితకాలం నిషేధం విధించడంలో తప్పేమీ లేదని అభిప్రాయపడింది. దీంతో సుప్రీంకోర్టు బెంచ్ తీర్పు చెప్పాల్సి ఉంటుంది. మరోవైపు కేంద్రప్రభుత్వం మాత్రం పిటిషనర్ విజ్ఞప్తిని అమలు చేయడం సాధ్యం కాదని పేర్కొంది. రాజకీయ నేతలు నేరం రుజువైతే జీవితకాలం నిషేధించాలన్న చట్టం అమల్లోకి వస్తే లాలూ ప్రసాద్ యాదవ్, శశికళ వంటి వారికి భంగపాటు తప్పదు. మరెందరో రాజకీయ నేతలు అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీరందరూ ఇక రాజకీయ సన్యాసం స్వీకరించక తప్పదు.