బలమో బలహీనతో ఏదో ఒకటి తేలిపోవాలి.. కాంగ్రెస్ ఓడి గెలిచెన్ కానీ బీజేపీ గెలిచి ఓడెన్.. ఇలా ఎవరి పంథా వారిది అనుకున్న తరుణాన ఓ వ్యక్తి మోడీపై తెగ నమ్మకం కనబరిచాడు. అహ్మదాబాద్ వీధుల్లో సామాన్య జీవితాన్ని గడిపే రఘుబీర్ చౌధురి.. మోడీకి పరిచయుస్తుడైన ఈయన ఎలా అయినా బీజీపీ గెలుస్తుందని అన్నారట! జ్ఞాన్ పీఠ్ అవార్డు అందుకున్న ఈయన తన నమ్మకానికి ఓ కారణం చెప్పారట అదేంటంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటుని కాంగ్రెస్ తనకు అనుగుణంగా మలుచుకోలేదని.. ఔను! అదే నిజమైంది పటేళ్లు, దళితులు, ఓబీసీలు ఇలా అంతా మద్దతు ఇచ్చినా గెలవకపోవడానికి ఇదే ఓ కారణం.
ఓట్లశాతం పెరిగింది సీట్లు తగ్గాయి ఎందుకని?
ఎన్నడూ లేని విధంగా మోడీ గ్రాఫ్ ఏమీ లేదులే అనుకున్నారు.. అంతేకాదు గుజరాత్ ఏ విధంగా అయినా కాంగీయుల పరం అయితే బాగుండు కొన్ని కఠిన నిర్ణయాలు అయినా ఆగుతాయి అని భావించారు. కానీ ఇవేవీ జరగలేదు. రాహుల్ నాయకత్వం కొంత సమర్థంగా మరికొంత అసమర్థతకు సంకేతంగా నిలిచింది. ఆఖరికి మణిశంకర్ అయ్యర్ లాంటి నేతల పలుకులు పరాకాష్టగా మారాయి. తత్ఫలితంగా కొంతలో కొంత కాంగ్రెస్ పుంజుకున్నా వెంటనే తగ్గింది. ఇక రాహుల్ గాంధీ హిందుత్వం మీద దేవాలయాల సందర్శన మీద నోరేసుకుపడిపోయిన బీజేపీ కొన్నిసెంటిమెంట్ ఆయిట్మెంట్ రాజకీయాలను బాగానే నెరపింది. తత్ సంబంధిత ఓట్లు కూడా నాలుగు బీజేపీ కి పడి ఉంటాయి. పోనీలే గాంధీ పుట్టిన చోట కాంగ్రెస్ బతికింది. బీజేపీ ఇంకా ఆలోచించుకుంటే బెటర్ .. గెలుపు మీద కాదు కానీ ఓటమి మీద ఫోకస్ చేస్తే బెటర్. రాళ్లు ముళ్లు రెండూ మోడీ అండ్ కో ఈ ఎన్నికల్లో దాటి వచ్చారనే అనుకోవాలి. ఆ హిందూ కార్డు రాజకీయాలు మానుకుంటే ఇంకొంచెం బెటర్. లేదంటే ఈ సారి దేశ రాజకీయాల్లో వీరు వినిపించే భక్తి విరక్తి గా మారే ప్రమాదం ఉంది.
మరికొన్ని కీలక నిర్ణయాలు వచ్చేనా?
గుజరాత్ సంబరాలు శ్రీకాకుళం నుంచీ ఢిల్లీ వరకూ సాగుతూనే ఉన్నాయి. బాగుంది.. ఇదే ఊపున మరో ఉత్పాతం సామాన్యుడి గుండె మీద పడనుంది. ఈ సారి మోడీ ఎఫ్ ఆర్ డీఐ ని తెరపైకి తెస్తే ఇక అంతే సంగతులు.. ఇంకా బ్యాంకింగ్ రంగంలో మరో కీలక సవరణ అయిన ...సారీ సంస్కరణ అయిన... బ్యాంక్ లావాదేవీల పన్ను వసూలు చేయాలని నిర్ణయిస్తే ఈ సారి ప్రజలు క్షమించరు గాక క్షమించరు. ఇప్పటికే సెన్సెక్స్ పరుగులు కొంత హడలెత్తించాయి. పతనం మరికొన్ని ఆందోళనలకు సందేహాలకు తావిచ్చాయి. వీటి నుంచి ఇన్వెస్టర్లు కోలుకున్నారని అనలేం.. పెద్ద నోట్ల రద్దుతో అంతా సర్దుకుంది అని ఒక్క బీజేపీ నేత కూడా చెప్పలేరు. కనుక ఏవో చేసి ఏదో అనిపించుకునే కన్నా ఇవాళ బీజేపీ నిర్మాణాత్మక వైఖరే కీలకం. అది కాదనకుంటే పతనం తప్పదు. ఇక త్వరలోనే తీసుకునే నిర్ణయాలు యూపీ ఎన్నికల ముందే అయితే కమల వికాసం ఏమంత గొప్పగా ఉండదు. పాపం మోడీ ని తగ్గమని ఎవ్వరూ చెప్పలేరు. చెప్పినా ఆయన వినరు కనుక ఇప్పట్లో ఈ కఠిన నిర్ణయాలు వస్తూనే ఉంటాయి.. ఓ విధంగా ఈ దేశానికి మరో ట్రంప్ అని కమ్యూనిస్టుల అభిప్రాయ పడినా అదేమాత్రం వాస్తవ దూరం కాదు.ఇక రాహుల్ కూడా తన సమర్థతని పెంచుకోవాలి. ఏవి అనుకూలిస్తాయో వాటిని బలపర్చుకోవాలి. తన శక్తిని ఇంకాస్త ఇనుమడింపజేసుకోవాలి. లేకుంటే ఆయన నాయకత్వంపై నీలి నీడల ప్రసారం తప్పదు. ఓ విధంగా రెండు విషయాలు ఆలోచించాలిక.. ఈ దేశం పాలనా వ్యవస్థ యువతరం నేతృత్వాన పనిచేసేందుకు ఇష్టపడుతోంది. అది కాదనలేని నిజం. అదేవిధంగా రిజర్వేషన్ రాజకీయాలు పెచ్చుమీరుతున్నాయి.ఇవి హార్థిక్ లాంటి నేతలకు స్టార్ డమ్ ఇమేజ్ ఇవ్వవచ్చు కానీ సామాజిక వెనుకబాటుని సంస్కరించలేవు. కార్పొరేట్ శక్తులకు దీటుగా అల్పేశ్ లాంటి నేతలు ఎదిగిన ఈ తరుణం ఆనందమే కానీ ఆయన కూడా ప్రబల శక్తిగా ఎదగాలి. ఇప్పటికే ఆయన గెలుపు ఇటు ఆంధ్రా తెలంగాణ నేతలను సైతం ఆశ్చర్యపరిచింది. అదేవిధంగా మరో దళిత నేత జిగ్నేశ్ మేవానీ లాంటి దళిత శక్తులను వినియోగించుకోవడంలోనూ ఇంకాస్త తెలివి ఉపయోగిస్తే మేలేమో! ఏదేతైనేం ఇవాళ కమల దళం కానీ కాంగీయులు కానీ సీజనల్ పాలిటిక్స్ ని నెరపి తరువాత ప్రజల కాంక్షలను పట్టించుకోక పనిచేస్తే చేదు అనుభవాలు ఎదుర్కొనక తప్పవు.అలానే దళిత సామాజికవర్గానికి చెందిన నేతలు తమ సత్తా చాటిన ఈ తరుణాన్ని ముఖ్య నేతలెవ్వరూ విస్మరించకూడదు.