అటెన్షన్ ప్లీజ్‌.. ఏపీలో ప‌దిరోజులు పాల‌న‌కు సెల‌వు!

Update: 2018-01-15 03:30 GMT

అదేంటి.. అనుకుంటున్నారా? ఏపీలో ప్రభుత్వ పాల‌న‌కు ప‌ది రోజుల పాటు బ్రేక్ ప‌డుతుందంటే న‌మ్మలేక‌పోతున్నారా? గ‌డియారాన్ని మింగేసి.. సెక‌న్లు, నిముషాలు, గంట‌లు అంటూ లెక్క పెట్టుకుని మ‌రీ ముందుకు క‌దులుతున్న చంద్రబాబు పాల‌న‌కు బ్రేక్ ఏంటి? అని విస్మయం వ్యక్తం చేస్తున్నారా? అక్కడికే వ‌ద్దాం. సీఎం చంద్రబాబుకు వ‌చ్చే ఏడాది ఎన్నిక‌ల భ‌యం ఉంది కాబ‌ట్టి ఆయ‌న టైం చూసుకుని, టైం ప్రకారం ముందుకు న‌డుస్తారు. కానీ, ఉద్యోగుల‌కు, అధికారుల‌తో ఆ అవ‌స‌రం ఉండ‌దు క‌దా?! ఈ క్రమంలోనే వారు త‌మ‌కు అనుకూలంగా ఉన్న అన్ని రోజుల‌కు సెల‌వు ప్రక‌టించాల‌ని డిసైడ్ అయ్యారు. ఇక‌, రాష్ట్రంలో నిన్న మొన్నటి వ‌ర‌కు ఉన్న ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. ఏపీలో జ‌న్మభూమి- మా ఊరు కార్యక్రమం నిర్వహించారు.

అందుబాటులో లేరే?

ఫ‌లితంగా ప‌రిపాల‌న సాగుతున్నట్టే ఉన్నా స్తంభించిపోయింది. ఒక్క మంత్రి కూడా అందుబాటులో లేకుండా పోయారు. స‌చివాల‌యంలో సీనియ‌ర్ అధికారులు అంద‌రూ జ‌న్మభూమి బాట‌ప‌ట్టారు. పాఠ‌శాల‌లో ఉపాధ్యాయులు కూడా జ‌న్మభూమి కార్యక్రమాల‌కు ప్రత్యేక విధులు నిర్వహించారు. ఇలా మొత్తం ఈ నెల 2 నుంచి 11 వ‌ర‌కు మొత్తంగా ప‌ది రోజుల పాటు పాల‌న నిలిచిపోయింది. స‌చివాలయంలో ఎక్కడి పైళ్లు అక్కడే ఆగిపోయాయి. ఉన్నతాధికారులు లేక‌.. ఆయా శాఖ‌ల‌కు మంత్రులు కూడా లేక ఫైళ్లు నిలిచిపోయాయి. రాబోయే రోజుల్లోనూ ఇదే ప‌రిస్థితి త‌లెత్తనుంది. దీనికి ప్రధాన కార‌ణం.. ప్రస్తుతం ప్రారంభ‌మైన సంక్రాంతి సెల‌వులు.

నిర్ణయాలు తీసుకునేందుకు....

తరువాత రెండు రోజుల పాటు కలెక్టర్లతో సీఎం సమావేశాలు.. ఉన్నాయి. దీంతో జిల్లాల్లో ప్రధాన ప‌నులు స్తంభించి పోయే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. ఆ తరువాత మంత్రివర్గ సమావేశం, 25వరకు ముఖ్యమంత్రి దావోస్‌ పర్యటన ఉంటుంది. ఇలా దాదాపు 10 రోజుల పాటు సచివాలయ, డైరెక్టరేట్‌ల పరిపాలనా యంత్రాంగం పూర్తిగా స్థంభించ బోతోంది. ముఖ్యంగా వారం రోజుల పాటు ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపించడంలేదు. మంత్రులు, కలెక్టర్లు,శాఖాధిపతులు, కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో పాల్గొనబోతున్న నేపధ్యంలో అటు జిల్లాల్లో, ఇటు సచివాలయ స్థాయిలో ఉద్యోగులకు పూర్తిగా వెసులుబాటు దొరికే అవకాశం ఉంది. తరువాత సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన ఉన్న నేపథ్యంలో సచివాలయంలో మంత్రులు జిల్లాలకు వెళతారు.

హైదరాబాద్ లోనేనా?

శాఖాధిపతులు.. సచివాలయానికి వస్తారా..? లేదా..? హైదరాబాద్‌కే పరిమితమవుతారా..? అనేది అంద‌రికీ తెలిసిన విష‌యమే. ఎప్పుడు అవ‌కాశం దొరికితే అప్పుడు హైద‌రాబాద్‌కు వెళ్లిపోవ‌డం అధికారులకు వెన్నతో పెట్టిన విద్య. ఇప్పటికే నెల రోజుల్లో కేవలం ఐదు నుండి పదిరోజులు మాత్రమే అధికారయంత్రాంగం పనిచేసిందని చెప్పవచ్చు. అటు ప్రభుత్వ సెలవులు,ఇటు అధికారుల ఉద్యోగుల సెలవులు..'జన్మభూమి' కార్యక్రమం, కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లతో అధికారులు, మంత్రులు ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. మ‌రోసారి.. ఇదే ప‌రిస్థితి ఎదుర‌వ‌బోతోంద‌ని అంటున్నాయి అమ‌రావ‌తి వ‌ర్గాలు. సో.. ఇది ప‌రిస్థితి!

Similar News