ఆయనది విలక్షణమైన శైలి. ఒకవైపు తిరుమల వేంకటేశ్వరుని సేవలో, బోర్డు సభ్యుడి హోదాలో పుణ్యం సంపాదిస్తుంటారు. మరొకవైపు వందల కోట్ల రూపాయల నల్లధనం పోగేస్తూ, పురుషార్ధం పుష్కలంగా సముపార్జిస్తుంటారు. అయితే నోట్ల రద్దు అనంతర పరిణామాల్లో ఐటీ అధికారులు దాడులు చేసేసరికి కళ్ళు చెదిరే వాస్తవాలు వెలుగు చూసాయి.
అయన పేరు శేఖర్ రెడ్డి. తమిళనాడులో వేలూరులో అయన వ్యాపార సామ్రాజ్యం ఉంటుంది. ఇసుక, గనుల వ్యాపారం చేస్తుంటారు. చంద్రబాబు టీటీడీ బోర్డు ప్రకటించినప్పుడు ఆయన పేరు చూసి అంతా నివ్వెరపోయారు. ఎవరబ్బా.. పదవి ఎలా సంపాదించారు అనుకున్నారు. తీరా అమ్మ జయలలిత ఆశీస్సులు, సిఫారసుతో పదవి దక్కించుకున్నారని తెలిసింది.
సదరు శేఖర్ రెడ్డి ఇంటిపై గురువారం ఐటీ దాడులు చేసారు. 70 కోట్ల విలువైన 2000 రూపాయల నోట్లతో నగదును, 100 కిలోల బంగారాన్ని కనుగొన్నారు. మొత్తం 90 కోట్ల రూపాయలు దొరికాయి. వేలూరులో చెన్నై లోని అయన ఇళ్ళు ఆఫీసులు , స్నేహితుల ఇళ్లపై కూడా దాడులు జరిగుతున్నాయి. పూర్తి వివరాలు ఇంకా తెలియలేదు.